29, అక్టోబర్ 2010, శుక్రవారం

ఎన్‌టివి ‘మిర్చి మసాల’పై కేసు


ఎన్‌టివిలో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రసారం చేస్తున్న మిర్చి మసాల కార్యక్రమంపై నగర పోలీసు కమీషనర్ ఎకె ఖాన్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. మిర్చి మసాల కార్యక్రమం ద్వారా అశ్లీల దృశ్యాలను ప్రసారం చేస్తూ యువతను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు భావించిన సిపి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 1995 కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం కింద 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 18 కింద ఫిర్యాదు చేసేందుకు ఒక్క కమీషనర్‌కు మాత్రమే అధికారం ఉంది. ఎన్‌టివి చైర్మన్ నరేంద్ర చౌదరి, ఔట్‌పుట్ ఎడిటర్‌తో పాటు మొత్తం ఏడుగురిపై ఫిర్యాదు చేశారు.

చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన కావడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. అశ్లీల ప్రసారాలను చేస్తున్న టివి చానల్స్‌పై పోలీసులు నియంత్రణ చేసేందుకు మానిటరింగ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కొన్ని అంశాలతో సిపి ఎకె ఖాన్ ఈ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఏం చర్య తీసుకోవాలన్నది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

కాగా టివిల్లో ప్రసారమయ్యే ఈ తరహా కార్యక్రమాలు సినిమాటోగ్రఫీ చట్టం కింద సెన్సార్ బోర్డుకు సంబంధం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కేబుల్ నియంత్రణ చట్టం కింద రెండేళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు. ఒక వేళ రెండోసారి ఇదే నేరాన్ని చేస్తే శిక్షను ఐదేళ్ళకు పెంచి రూ.5 వేలు జరిమాన విధించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.








ఆంధ్ర భూమి సౌజన్యం