29, అక్టోబర్ 2010, శుక్రవారం

మాలధారణం....నియమాల తోరణం....

నిష్ట... నియమం... మనసు నియంత్రణ... చెడు వ్యసనాలకు దూరం.. దైవారాధనే ప్రధాన మంత్రం.... వెరసి మాలధారణం.... వెళ్లేదారి ఏదైనా చేరే మార్గం మాత్రం ఒక్కటే... అందుకే ఆధ్యాత్మికతకు ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. నిష్టగా ఉండి దీక్షతో తాను కొలిచే దేవుడి ప్రాంగణానికి వెళ్లాలని భ క్తులు ఆశిస్తున్నారు. ఆయా దేవుళ్లకు సంబంధించిన మాలధారణ చేసి నియమనిష్టలతో దేవుడిని పూజిస్తున్నారు. మనసును నియంత్రించే శక్తిని మాలకు ఉందని విశ్వసించి అదే బాటలో పయనిస్తున్నారు భక్తులంతా. స్వామి శరణం... అయ్యప్ప శరణం.. అంటూ శరణఘోషలో ఉదయం, రాత్రి వేళల్లో అయ్యప్పస్వామిని ప్రార్థిస్తున్నారు. 41 రోజుల మండలి దీక్ష చేసిన వారంతా శబరిమలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మాలధారణ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

ఇప్పటికే వేలాది మంది భక్తులు మాలధారణ చేసి అయ్యప్ప భక్తి సేవలో తరిస్తున్నారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత స్నానమాచరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయంలో శరణ ఘోష చెప్పాలి. మాలవేసుకున్న భక్తులు ఎదుటివారిలో అయ్యప్పనే చూడాలి. అందుకే ఎవరికి ఎక్కడ పలకరించినా స్వామిఅని, మహిళలను మాత అని సంబోధిస్తారు.

నవంబరు 16న శబరిమల పుణ్యక్షేత్రంలో పడిపూజ (మెట్లు పూజ) నిర్వహించి దేవాలయాన్ని తెరుస్తారు. ఆ సమయానికి అక్కడకు వెళ్లడానికి అయ్యప్ప స్వాములు ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు బుక్ చేసుకున్నారు. జనవరి నెలలో మకర జ్యోతివరకూ స్వాములు శబరిమలకు వెళుతూనే ఉంటారు. స్వామిని దర్శించేనాటికి ప్రతి ఒక్కరూ 41 రోజుల పాటు దీక్ష చేయాల్సి ఉంటుంది. ఇరుముడిని పట్టుకుంటేనే 18 బంగారు మెట్లు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం, ప్రయాణం ఇలా అన్ని ఖర్చులు కలిపి ఒక్కక్క భక్తుడికి దాదాపు 8 వేల నుంచి 10 వేల వరకూ ఖర్చు అవుతుంది.