ఏనుగుల బారినుంచి కాపాడండి..వాటివల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వండని.. మొరపెట్టుకున్నా కనికరించని అటవీశాఖ అధికార్లు గిరిజనులపై తమ ప్రతాపం చూపించేపనిలో పడ్డారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మృతిచెందిన ఏనుగులను పాతిపెట్టారని .. అటవీశాఖ చట్టం కింద 9,12బి,36,51 సెక్షన్లు కింద కేసులు నమోదు చేసి ఎనిమిదిమంది గిరిజనులని అరెస్టు చేశారు. మరో 20 మంది అటవీశాఖ అధికార్ల అదుపులో ఉన్నట్టు తెలిసింది...
వివరాలలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కుంబడి ఇచ్చాపురం అటవీ ప్రాంతంలో గతంలో ఏనుగుల బారి నుండి రక్షించేందుకు ఆపరేషన్ గజ చేపట్టిన అధికారులు... ఆపై ఏనుగుల్ని లఖేరి అడవులకు తరలిస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక రెండు మరణించాయి. అందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కారణాలపై ఎలాంటి విచారణ జరపలేదు. తరలించడం చేతకాకనే మిగిలిన ఆరు ఏనుగులను సీతంపేట ఏజెన్సీలో వదిలేశారు.
ఆరు ఏనుగుల మరణాలపై ఒడిషా ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. అది ఇంకా విచారణలోనే ఉంది. నాటి మరణాలకు అధికార్లే కారణం. అందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడలేదు.
గతంలో అధికార్లు వదిలేసినా ఏనుగులు ఇక్కడి గిరిజనాలను అష్టకష్టాలు పెట్టి... ఐతే ఉహిచని విధంగా రెండు ఏనుగులు మృత్యు పాలయ్యితే వాటి దుర్వాసన భరించలేక గిరిజనం పూడ్చిపెట్టారు. ఐతే పూడ్చిన 15 రోజుల తరువాత మీడియా వెలుగులోకి తెచ్చినంతవరకూ అధికార్లకు తెలియలేదు. ఉన్నతాధికార్ల చివాట్లతో .అటవీశాఖ సిబ్బంది ఇచ్చాపురం గ్రామాన్ని చుట్టుముట్టి గిరిజనులను బెదిరించడం, భయపెట్టడం వేధిస్తున్నరని సమాచారం. కాగా దంతాలు కోసం అటవీ స్మగ్లర్లె ఏనుగుల్ని చంపేసి పడేస్తే... వారని పట్టుకోలేని అధికార్లు... తమని ఇబ్బంది పాలు చేస్తున్నారని గిరిజనం ఆరోపిస్తున్నారు. అరెస్టులకు సంబంధించి అదుపులోకి తీసుకున్నవారికి సంబంధించి మీడియా దృష్టికి తీసుకెళ్లరాదని అదుపులోకి తీసుకున్నవారి కుటుంబసభ్యులను, గ్రామస్తులను హెచ్చరించారని తెలిసింది.
అటవీచట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం అధికార్లకు ఒకటి, గిరిజనులకు ఒకటి ఉండదు. ఆ ప్రాథమిక అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికార్ల చర్యలు తీసుకుంటే అది పూర్తిగా గిరిజనుల వ్యతిరేక చర్య అవుతుంది.