9, నవంబర్ 2010, మంగళవారం

మహా నగరం లో కూర'గాయాలు'

గత నెల 29 నుంచి జనాన్ని వరుణుడు బాధిస్తుంటే ఇదే అదనుగా నిత్యావసర వస్తువుల, కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో, వర్షాల కారణంగా పనుల్లేక కాలం గడుపుతున్న వ్యవసాయ కూలీలు, పేదలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. హఠాత్తుగా పెరిగిన ధరల వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక హైదరాబాద్ లో సగటు జీవి నానా అవస్థలు పడుతున్నాడు.

29వ తేదీ నుంచి ఈ వారం రోజుల్లోనే కూరగాయల ధరలు నూరు శాతం పెరిగాయి. వారం క్రితం కేజీ వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, క్యారెట్‌, కాకరకాయల ధరలు రూ.20 చొప్పున ఉండేవి. ఇప్పుడు వాటి ధర రూ.40లకు చేరింది. చిక్కుడుకాయల ధర రూ.15 నుంచి రూ.30లకు చేరుకుంది. నిలకడగా ఉల్లిపాయలు, టమాటాల ధరలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే కిలో రూ.20లకు దొరుకుతున్నాయి.

ఓ వైపు వర్షాలకు పనులు లేకపోవడం, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశనంటడంతో నగరంలో 60 శాతం మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే అద్దెకు ఉండే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇంటి అద్దెలు కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతో వీరు కుదేలైపోతున్నారు. ప్రయివేటు కంపెనీలు, షాపుల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెరగలేదు. రోజు కూలికి వెళ్లేవారి కూడా కూలిరేట్లు పెరగలేదు. కాని ధరలు పెరుగుదల, ఇళ్ల అద్దెలు పెరుగుదల భారం మాత్రం వీరి నెత్తిన పడింది. తరుచూ వర్షాల వల్ల పనులు ఉండడం లేదని అన్ని రోజులు పనులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు.