24, జనవరి 2011, సోమవారం

హోంమంత్రి రాజీనామా చేయాలి : నన్నపనేని

మద్దెలచెరువు సూరి హత్యకేసులో రాష్ట్ర హోం మంత్రి కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా తక్షణమే మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.

పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిపై ఆరోపణ వస్తే ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళి ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ... సూరి హత్య కేసులో హోం మంత్రి కుమారుడిపై ఆరోపణలుంటే పోలీసులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

భాను, సూరి అనుచరులు హోం మంత్రి బంగళా నుంచే లావాదేవీలు జరిపినట్లు .. సూరి హత్యకు సంబంధించి కుట్రలు, సెటిల్‌మెంట్‌లు, చర్చలు నడిచాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె గుట్టుచప్పుడు కాకుండా క్వార్టర్స్‌ను ఖాళీ చేయడం జరిగిందని, అసలు అక్కడ ఏం జరిగిందో బయటకు తెలియాలని ... కేవలం తన కొడుకును రక్షించుకోవడానికే భానును అజ్ఞాతంలో ఉంచి పోలీసులతో రోజుకొకరిని విచారణ జరుపుతూ డ్రామా ఆడుతున్నారని ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే తక్షణం హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.