మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో మెగాహిట్ సాధించినా తొలి ప్రాధాన్యం మాత్రం బుల్లితెరకేనంటూ వర్ధమాన టీవీ, సినీ నటుడు సారుుకిరణ్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీగాయకుడు రామకృష్ణ కుమారుడే సాయికిరణ్. నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యంతో కూడిన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండి పోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. బుల్లితెరను తన మజిలీగా మలచుకున్న సాయికిరణ్ న్యూస్‌లైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.
పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం
బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.
ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.
ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.