శరవేగంగా అందివస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని పొరుగు రాష్ట్రాలు తమ తమ మాతృభాష వికాసానికి ఉరకలు, పరుగులు తీస్తుండగా, ఈ విషయంలో తెలుగుభాష వెనుకపడిపోకూడదని పలువురు సాంకేతిక నిపుణులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మూడవ రోజు ముగింపు సభను ఎస్‌విఎస్ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ''సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి'' అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కంప్యూటర్ శాస్త్రవేత్తలు 'అంతర్జాలం' (ఇంటర్నెట్) తెలుగు భాషా వ్యాప్తికి కూడా అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ, తెలుగు భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దడానికి 'అంతర్జాలం' అందివచ్చిందన్నారు. అంతర్జాలంను శక్తివంతమైన మాధ్యమంగా అభివర్ణిస్తూ, ప్రపంచానికి మాటా మంత్రం నేర్పిన తెలుగుజాతి గొప్ప రచయితలను జాతికందించిందని, ఈ రచనలు దేశందాటి వెళ్ళడానికి ఇంటర్నెట్ వినియోగమే ప్రత్యామ్నాయ మన్నారు. ఇప్పటి వరకు మూడు వేల పుస్తకాలను ఇంటర్నెట్‌లో బంధించామని, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ అంతర్జాల వినియోగాన్ని వేగవంతం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగు రచయితలపై ఉందన్నారు. వచ్చే సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో అమెరికాలోని సిలికానాంధ్రలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఈ సమావేశాల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కంప్యూటర్ ఇంజనీర్ అంబరీష్ రూపొందించిన 'రమణీయ' యూనికోడ్ ఫాంటును ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలుగును ఆధునిక భాషగా తీర్చిదిద్దడానికి సాంకేతిక నిపుణుల చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎ.పి. నాలెడ్జ్ నెట్‌వర్క్ ప్రముఖుడు ఎ.అమరనాథరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున ఆరు ఫాంట్లను సిద్ధం చేశామన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి మైనేని దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సైన్స్‌ను తెలుగుపరంగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ-రీడర్‌ను ప్రవేశపెట్టి తెలుగు రచనలను తక్కువ ఖర్చుతో ఆకళింపు చేసుకోవడం ద్వారా మాతృభాషను సుసంపన్నం చేసుకోవచ్చని సూచించారు. ఈ-తెలుగు రూపకర్త వీవెన్ మాట్లాడుతూ వాక్య నిర్మాణంపై రచయితలు స్పష్టతను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ రంగ ప్రముఖులు కె.ఎస్.బి.వి.కె.శివరావు, జి.వెంకట్రామయ్య, బి.వెంకట్రామ్, కిరణ్, కె.వీరభద్రశాస్త్రి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు వి.హర్షవర్ధన్, చావా సురేష్, రెహమానుద్దీన్ తదితరులు పాల్గొని తెలుగుభాష విశ్వపరివ్యాప్తమవ్వడానికి అంతర్జాలాన్ని వినియోగించు కోవడంపై పలు సూచనలు చేశారు.