ఆంధ్రప్రదేశ్‌లో క్రోనికేపిటలిజంకు ఉదాహరణగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని పేర్కోవచ్చు. ఈ సంస్థ 1987--88లో 20 లక్షల ఆస్తులను చూపింది. 1999-2000 నాటికి దీని ఆస్తుల విలువ 26.50 కోట్లకు చేరుకున్నాయి. 2004-05 నాటికి 167 కోట్ల విలువైన ఆస్తులు నమోదయ్యాయి. గతేడేళ్ళలో ఇవి 1140 కోట్లకు చేరుకున్నాయి. ఇదికాక రాష్ట్ర తీరంలో అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని ఇదే సంస్థ కైవసం చేసుకుంది. ఈ పోర్టుల నిర్మాణం పేరిట 7 వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వం నుంచి పొందింది. తాజాగా ఇదే సంస్థకు మచిలీపట్నం పోర్టు అప్పగించి 15 వేల ఎకరాల్ని దఖలుచేయాలంటూ కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తీరప్రాంత భూముల విలువ వేలకోట్లలో ఉంటుంది. 2002లో 1.80 కిలోమీటర్ల పొడవైన యానాం.. ఎదుర్లంక వంతెన నిర్మాణాన్ని చేపట్టిన ఈ సంస్థ ఆర్ధిక లేమితో సతమతమైంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అడ్వాన్స్‌లిచ్చి ఈ సంస్థను ఆదుకుంది. అలాంటిది తొమ్మిదేళ్ళ వ్యవధిలో కోస్తాతీరంలో దాదాపు సగభూభాగాన్ని ఈ సంస్థ సొంత ఖాతాలో వేసుకోగలిగింది. వేలకోట్లకు పడగలెత్తగలిగింది. కార్పొరేట్ వ్యవస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కలసి క్రోనికేపిటలిజంకు పాల్పడితే జరిగే దోపిడీకిదే ప్రతీక.