కల్పనాథ్ ఆధ్వర్యంలో చక్కెర కుంభకోణం ఆనాడు పార్లమెంటు ను కుదిపివేసింది. అప్పుడు ప్రభు త్వం తీసుకున్న అస్తవ్యస్త చర్యలు అవినీతి ఫలితంగా ప్రజలపై భారం 3వేల కోట్లకుపైగా పడింది. స్వేచ్ఛా విపణిలో చక్కెర ధర కేజీ రూ.11ల నుంచి రూ.17లకు పెరగడంవల్ల చౌక ధరల దుకాణాలలో సరఫరా చేసే చక్కెర ధర కేజీ రూ. 1.75పైసలు పెంచడం వల్ల చక్కెర ధర 66 శాతం పెరిగింది. చివరకు కేంద్ర పౌరసరఫరాల శాఖమంత్రి ఎ.కె ఆంటోని, చక్కెర కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించిన కల్పనాథ్ మంత్రి పదవులకు రాజీనామాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరొక ముఖ్యమైంది హవాలా కుంభకోణం. హవాలా అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన అనధికార లేదా అక్రమ లావాదేవీల ప్రక్రియను హవాలా అని పేరు. అంతేకాక హవాలా అంటే అప్పగింత అని కూడా అర్థం. అంతర్జాతీయ స్థాయిలో సాగే అక్రమ లావాదేవీలకు హవాలా ఒక ముఖ్యమైన యంత్రాం గంగా వ్యవహరించింది. రకరకాల తప్పుడు మార్గాల్లో ఈ సొమ్మును అటు ఇటు చేరవేయడంలోనూ, హవాలా నిర్వాహకు లు నిర్వహిస్తారు. వీరు ఇండియాలోనూ, విదేశాల్లోనూ బినామీ ఖాతాలు ప్రారంభించి నల్లడబ్బును ఈ ఖాతాల ద్వారా బదలాయిస్తారు. విదేశాలలో విలాసాలు జరపాలనుకునే వారు. విలువైన వస్తువులు పొందగలిగేవారు. అంతర్జాతీయంగా అక్రమ వ్యాపారాలు చేసే వారు హవాలాను ఆశ్రయిస్తారు. గతంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్టు ద్వారా విదేశీ మారకం కావలసిన వారు అందుకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేసి కొన్ని పరిమితులకు లోబడి డాలర్లు తీసుకునే వీలయ్యేది. ఇటీవల కాలంలో మన్మోహన్ ఆర్థిక విధానాల వలన ఈ చట్టం రద్దు అయింది. సరళీకరణ ఆర్థిక విధానాల వలన, విదేశీ కంపెనీలు యదేచ్ఛగా ప్రవేశం కల్పించడంలో హవాలా లావాదేవీలు కొనసాగుతున్నాయి. లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకులలో మూలుగుతున్నది. హవాలా కుంభకోణం ప్రక్రియలో పి.వి. నరసింహారావు, యస్‌కె జైన్, ఆరిష్ మహ్మద్‌ఖాన్, మదన్‌లాల్ ఖురానా, కె.కె. ధావన్, మాధవరారు సింధియాలకు సంబంధము ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇక యుపిఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపివేసినవి. 2జీస్పెక్ట్రమ్ కుంభకోణం 1లక్ష 76వేల కోట్ల రూపాయలు. చివరకు మంత్రి డి. రాజా, ఎంపీ కనిమొళి కటకటాల వెనుక ఊచలు లెక్కపెడుతున్నారు. కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంలో, స్టేడియం నిర్మాణం, మరమ్మత్తులు, క్రీడలు మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్రీడలకు అవసరమైన సామాగ్రి కొనుగోలునించి అన్ని వ్యవహరాలలోనూ అధికార యంత్రాంగం అంతులేని అవినీతి చేసిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నవి. క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడిని కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యదర్శి పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ కుంభకోణంలో వేల కోట్ల నష్టం జరిగిందని తేలింది. మహారాష్ట్రలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం ఆదర్శసొసైటీ. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోకచేవాన్ పదవి నుండి వైదొలగిన పరిస్థితికి దారితీసింది. యుద్ధంలో మరణించిన వీర జవానుల భార్యా, పిల్లలకు చెందాల్సిన ప్లాట్లను కూడా వదలలేదు. ముంబాయిలోని విలాసవంతమైన కోలాబో ప్రాంతంలో 31 అంతస్థులను నిర్మించారు. 103 మీటర్లు ఎత్తు, 103 ప్టాట్లలో ఒక్క ప్లాటు కూడా యుద్ధ వీరుల భార్యలకు, పిల్లలకు కేటాయించలేదు. ఈ ప్లాటులన్నింటినీ ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులు పంచుకొని మార్కెట్ ధరకు ఒక్కొక్క ఫ్లాట్ రూ. 10 కోట్లు ఉన్న వాటిని రూ. 80 లక్షలకు విక్రయించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. సత్యం కంప్యూటర్స్‌లో వేలాది కోట్ల రూపాయల అవినీతి లావాదేవీలు ప్రపంచ దేశాలలో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా కుదిపేసిన అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రభుత్వ భూములు, అక్రమ సంపాదనలు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరములు పరిశీలిస్తే అంతర్జాతీయ అవినీతి ఈ విధంగా ఉన్నది అనేది సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ద్వారా తెలిసింది. వై.యస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అల్లుడైన అనిల్ కుమార్‌కు ఖమ్మం జిల్లాలో 1లక్ష 20వేల ఎకరాలు గనుల భూములు కట్టిపెట్టడం ప్రజలందరికీ తెలిసిన విషయం.
కె.జి గ్యాస్ భారీ కుంభకోణం చాలా ప్రముఖమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ నుండి వెలువడే గ్యాస్‌ను కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ ఇండిస్తీస్‌కు మధ్య పంపిణీ ఒప్పందానికి సంబంధించినది. రిలయన్స్ సంస్థ మొదట 2.4 బిలియన్ డాలర్ల అభివృద్ధి ఖర్చు చూపించి తర్వాత 8.5 బిలియన్ డాలర్లకు పెంచి చూపేందుకు ఎందుకు అనుమతించారని కాగ్ ముసాయిదా నివేదిక ప్రశ్నించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో సుమారు 45000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసారు. రిలయన్స్‌వారు, పెట్రోలియం శాఖ అధికారులు కుమ్మక్కైనారని కాగ్ నివేదిక తెలిపింది.
అత్యున్నత నైతిక విలువల కోసం ఉన్నామని చెప్పుకుంటున్న బిజెపి బండారం కూడా బయటపడింది. అవినీతి అంశాన్ని గత ఎన్నికలలో ప్రధాన అంశంగా ప్రచారం చేసిన బిజెపి నాయకులు అద్వానిపైన అప్పటి బీహర్ శాసనసభా పక్ష నాయకుడు యశ్వంత్ సిన్హాపైన చార్జీషీటు దాఖలు కావడంతో బిజెపి బండారం బయటపడింది. కానీ ముడపులు ముట్టిన వారిలో మదన్‌లాల్ ఖురానా, యల్.కె. అద్వానీ ఉన్నారనేది వాస్తవం. కర్నాటకలో బిజెపి ముఖ్యమంత్రి యెడ్డ్యూరప్పలు అవినీతి కుంభకోణాలలో చిక్కుకుని అవినీతిలో కూరుకుపోయిన సంగతి వేల కోట్లు అవినీతి చేశాడని బంధుప్రీతి, అడ్డగోలు నిర్ణయాలు చేశాడని, గనుల మాఫియాకు, సంబంధిత తదితర అంశాలపై సాక్షాత్తూ లోకాయుక్త సంతోష్ హెగ్డే, ఆ రాష్ట్ర గవర్నర్ భరద్వాజ్ హెచ్చరికలు మనందరికి తెలిసినవే. చివరకు అప్ప వైదొలగినా తనమనిషినే సిఎం చేశారు.
ఇక నల్లడబ్బు సంగతి పరిశీలిస్తే దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో భరించలేని స్థాయికి చేరుకున్నదనేది వాస్తవం. మనదేశం నుండి అక్రమంగా తరలించబడిన సొమ్ము 20లక్షల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. 1990-2010 సం్ప్పల మధ్య దేశం నుండి అక్రమంగా నిధులు తరలిపోవడం అధికమయిందని ఒక అధ్యయన సంస్థ పేర్కొంది. ఇతర దేశాలలో ఎవరి పేరున ఎంతెంత ఉన్నది అనే వివరాలు చెప్పడానికి మన్మోహన్‌సింగ్ సర్కారు ముందుకు రాకపోవడం నల్ల డబ్బు లాబీలు ఎంత బలంగా ఉందో అర్థమౌతోంది. 1966లో మొట్టమొదటగా లోకపాేల్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పటిష్టమైన, స్వతంత్రమైన లోకపాేల్ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని దాటవేస్తూ వచ్చారు. వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వామపక్షాల కోరికను అనుసరించి 1989 సంవత్సరంలో లోకపాేల్ బిల్లులో ప్రధానిని చేర్చడానికి అంగీకరించారు. 2009లో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రణబ్ కూడా ప్రధానిని చేర్చారు. కానీ ఇప్పుడు ప్రధానిని చేర్చడానికి వీలులేదని మన్మోహన్ సర్కారు తటపటాయిస్తుంది. అత్యంత నీతి నిజాయితీగా ఉన్న మన్మోహన్‌సింగ్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.
సుప్రీంకోర్టు, తదితర జడ్జీల బంధుప్రీతి, అవినీతి కార్యకలాపాలు అరికట్టడానికి నేషనల్ జ్యూడీషియల్ కమిటీని ఏర్పాటు చేయలేని చేతగాని ప్రభుత్వంగా ఉంది. న్యాయమూర్తులు కూడా జవాబుదారీ తనం ఉండవలసి ఉంది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌లు ఇస్తున్నారు. వీరందరికీ ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఎక్కడ నుండి వస్తున్నవనేది నిశితంగా విచారణ చేయడం లేదు. అంతేకాక తప్పుడు సమాచారంతో ఇచ్చిన అఫిడవిట్ దారులపై ఎందుకు విచారణ చేయడం లేదు. అఫిడవిట్‌లు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఉదాహరణకు:- మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య గారి పేరున ఒక్క కారు కూడా లేదని అఫిడవిట్‌లో యిచ్చారు. కె. రోశయ్యగారు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ స్థాయిలలో మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసిన ఆయనకు కారు కూడా లేదంటే ప్రజలు నమ్మగలరా ఆఫిడవిట్‌లు దాఖలు చేసిన వారి బంధువుల ఆస్తులు, బినామీ ఆస్తులను ఎంక్వైయిరీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కనుక లోకపాేల్ బిల్లు అత్యంత అవసరం అనేది దేశప్రజల ముందు చర్చ జరుగుతోంది. తప్పని సరిగా లోకపాేల్ బిల్లులో ప్రధానిని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులను చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రస్తుత విధానాల వలన అవినీతి పెచ్చుపెరిగి విలయతాండవమాడుతోంది. ప్రజాధనం ఇంత పెద్ద వెూతాదులో లూటీ కావడాన్ని అడ్డుకోవలసి ఉంది. ప్రతిఘటించవలసి యున్నది. సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ అవకతవకలకు, అవినీతికి అవకాశాలు విపరీతంగా పెంచింది. అవినీతి అరికట్టాలంటే లోకపాేల్ బిల్లు వచ్చినంత మాత్రాన పోతుందని కాదు. ప్రైవేటీకరణ, సరళీకకరణ తగ్గించడం ద్వారానో, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపర్చడం ద్వారానో ఎన్నికల ఖర్చు, అవినీతి తగ్గాలంటే దామాషా పద్ధతి మీద ఎన్నికలు జరపడమే మేలు. కాబట్టి లోకపాేల్ బిల్లు తేవడంలోనూ, అవినీతి, నల్లడబ్బు అరికట్టడంలో, రాజకీయ నాయకులు, బడా కార్పొరేట్ సంస్థలు అవకతవకలు, నేరాల మీద పెద్ద ఎత్తున ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు వివిధ వర్గాల సంస్థలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కదలాలి. నిరంతరం ఉద్యమం చేయాలి. పాలకుల మెడలు వంచి ప్రజాభిప్రాయానికి దిగి వచ్చే విధంగా ప్రజాచైతన్యంతో పోరాడాలి.
- రాజగోపాల్