18, డిసెంబర్ 2011, ఆదివారం

చరిత్ర పునరావృతం చేస్తున్న కాంగ్రెస్‌

చరిత్ర పునరావృతం అవుతుంది' అనేది అరిగిపోయిన మాటే. కానీ రాజకీయాల్లో మాత్రం నిత్యనూతనం. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు, కుమ్ములాటలు పరిశీలిస్తున్నవారికి రాష్ట్రంలో మరోసారి చరిత్ర పునరావృతమవుతున్నదన్న భావన కలుగుతుంది. 1978 -82 మధ్య ఐదేళ్ళు; 1989 -94 మధ్య ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కలహాలు, నేతల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 1978 -82 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ప్రతిపక్షం లేదు. స్వపక్షంలోనే విపక్షం ఉండేది. ఆ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నలుగురు ముఖ్యమంత్రుల్ని చూశారు. 1989 . 94 మధ్య కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా కాంగ్రెస్‌కు స్వపక్షంలో తప్పలేదు. ఆ ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు.
2009 ఎన్నికల తర్వాత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రోశయ్య ఎక్కువకాలం పరిపాలన సాగించలేక అర్థాంతరంగా తప్పుకోవలసి వచ్చింది. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో రోశయ్య విఫలం చెందారనడం కంటే... సహచర కాంగ్రెస్‌ నేతల విశ్వాసం పొందలేకపోయారనడం సబబు. తనకు మంత్రులెవరూ సహకరించడం లేదని రోశయ్య ఢిల్లీ వెళ్ళి తమ అధిష్టానం ముందు మొరపెట్టుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలోని ఒక బలమైన సామాజిక వర్గం రోశయ్య పదవినుంచి తప్పుకొనే వరకూ నిద్రపోలేదు.
రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకొన్న తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చి ఆ పదవిని అధిష్టించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రస్తుతం పొసగడం లేదన్న వార్తలు కొట్టివేయదగినవేమీ కాదు. పిసిసి అధ్యక్షుడు కావడంలో విజయం సాధించి తొలిమెట్టు అధిరోహించి బొత్స సత్యనారాయణ మలిమెట్టు అధిష్టించడానికి ఆరాటపడుతున్నారు. రోజుకో కొత్త పథకంతో... ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొత్స కంట్లో నలుసుగా మారారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న 'రాజీవ్‌ యువకిరణాలు' పథకంపై పదునైన విమర్శలు చేసి బొత్స పిసిసి అధ్యక్షుడిగా తన పట్టు నిరూపించుకోవాలని ఆరాటపడ్డారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒంటెత్తు వ్యవహారశైలి 'బొత్స'కు బాగా ఉపయోగపడింది. కేబినెట్‌లో సీనియర్లయిన డిఎల్‌ రవీంద్రారెడ్డి, జానారెడ్డి వంటివారు కొన్ని పథకాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు.
కొత్త పథకాల జోరుతో ప్రభుత్వంపై, పార్టీపై పట్టు సాధించాలని చూసిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీనియర్‌ మంత్రుల విమర్శలు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాయి. కలెక్టర్ల సమావేశంలో సీనియర్‌ మంత్రులు పరిపాలనా లోపాల్ని ఎత్తిచూపుతూ చేసిన నిశిత వ్యాఖ్యలు... జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో పడేసింది. సాధారణంగా కేబినెట్‌ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొంటుంది. ప్రతి నిర్ణయాన్ని కేబినెట్‌ మంత్రులు సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. కానీ, ఇపుడు ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులే వ్యతిరేకిస్తున్నారు. అంటే అర్థం... చాలా నిర్ణయాల్లో వారికి ప్రమేయం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఒక్కరే తీసుకొంటున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. కిలో రూపాయి బియ్యం పథకంతో సహా ఇటీవల ప్రకటించిన చాలా స్కీమ్స్‌ ముఖ్యమంత్రి సొంతవి.
ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో మంత్రుల భాగస్వామ్యం లేకపోవడం పార్లమెంటరీ డెమోక్రసీకి మచ్చ. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం సందర్భంగా... శాంతిభద్రతలపై జరిగే సమీక్షా సమావేశేంలో ఒక్క హోంమంత్రి మినహా మిగతా మంత్రులందర్నీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లమని ముఖ్యమంత్రి ఆదేశించడం కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహారశైలిని గమనిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే... ఆయన అంత నిర్మొహమాటంగా మంత్రుల్ని బయటకు పంపించడమే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మంత్రులతో సమన్వయం చేసుకోకుండా, టీమ్‌ వర్క్‌ లేకుండా ఆయన తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోగలరో అర్థం కాదు.
పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఏ విధంగా సమన్వయం లేదో... పార్టీ వ్యవహారాలకు సంబంధించి సి.ఎం., పీసిసి అధ్యక్షుడి మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నట్లు కన్పించడం లేదు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన జగన్‌ వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వేటువేయాలని బొత్స ఉత్సాహపడుతుండగా ఆ ప్రక్రియను వీలైనంతమేర వాయిదా వేయించాలని కిరణ్‌కుమార్‌ రెడ్డి భావిస్తున్నారు. వేటుపడ్డాక వచ్చే ఉప ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇబ్బందికరమైనదని కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెలుసు. ఉప ఎన్నికలు వచ్చి మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైతే... కిరణ్‌కుమార్‌ రెడ్డికి పరిపాలించడం కష్టమవుతుందనే భావనతో... గీతదాటిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనంటూ పిసిసి అధ్యక్షుడు పట్టుబడుతున్నారు. రాజకీయంగా వీరిద్దరూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకొంటుంటే... వీరిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తమకు అలవాటైన 'విభజించు -పాలించు' సూత్రాన్ని అమలు చేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... వాటికి బొత్స ప్రోత్సాహం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల శైలిని గమనించే వారికి... అది వార్త కానేకాదు... జోడు పదవులు నిర్వహిస్తున్న బొత్సను మంత్రిపదవి నుంచి తప్పించి పిసిసికి పరిమితం చేయాలని సి.ఎం. తమ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలొచ్చాయి. అది నెరవేరకపోయేసరికి సిఎం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా, ఉత్తరాంధ్ర మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేసి కీలక సమాచారం సేకరించినట్లు, ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవి జరిగినట్లు సాగుతున్న ప్రచారం నిజమైతే... రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడల్లా చరిత్ర పునరావృతం అవుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కేవాలి?