18, డిసెంబర్ 2011, ఆదివారం

చీ'కట్‌'లో పరిశ్రమలు

ప్రకృతి చేసిన గాయం రాచపుండులా మారి యావత్‌ రాష్ట్రప్రజానికాన్ని కంటనీరుపెట్టిస్తోంది. తీవ్రవర్షాభావ పరిస్థితులు అన్నదాతల అంతుచూడగా... ఎడాపెడా విద్యుత్‌ కోతలు ఉపాధికి ఉరితాళ్లను పేనుతున్నాయి. గడిచిన నాలుగునెలల కాలంగా విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం రూ.50వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఫలితంగా పరిశ్రమల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయే ప్రదకర పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షఉద్యోగాలు మాట ఎలాఉన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడి నిరుద్యోగ సమస్య జటిలం కానుంది. వేసవికి ముందుగానే విద్యుత్‌ లోటు భారీగా కనిపిస్తుండటంతో రబీసాగుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ విద్యుత్‌ కోత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆశయం నెరవేరే సూచనలు కనిపించడంలేదు. కష్టకాలంలో సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్న
ధర్మల్‌ ప్రాజెక్టులు... విద్యుత్‌ కేటాయింపులో కేంద్రం మాట నిలబెట్టుకోకపోవడం... వెరసి రానున్న కాలంలో రాష్ట్రప్రజలు మరింత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం రైతులతోపాటు పారిశ్రామిక రంగంపై కూడా పడింది. చినుకుజాడలేక ఎండిపోయిన ఖరీఫ్‌పంటచేలు పశువుల మేతకు బీళ్లుగా మారగా, పరిశ్రమలు సైతం పడకేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సకలజనుల సమ్మె ప్రారంభమైన నాటినుండే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ప్రారంభం కాగా, నానాటికీ కోతల సమయం పెరుగుతూ పోతుండటంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా ఉండే పరిశ్రమలు ప్రస్తుతం సంక్షోభం దిశగా అడుగులు వేస్తుండటంతో ఆప్రభావం లక్షలాది మంది కార్మికులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగునెలలుగా పవర్‌హాలిడే పేరుతో వారానికి రెండురోజుల చొప్పున పరిశ్రమలకు పూర్తిగా విద్యుత్‌ కోత విధిస్తుండటంతో పనులు సాగక కార్మికులు తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. పవర్‌హాలీడే పుణ్యమాని రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పటికే రూ.50వేల కోట్ల వరకూ నష్టపోయాయి. దీంతో బ్యాంకురుణాలు కూడా చెల్లించలేక పరిశ్రమల యజమానులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. పవర్‌హాలీడేతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి పదిన్నర వరకు పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తుండటం, అనధికారికంగా కూడా కోతలు సాగుతుండటంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీదినపడే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
అయితే వచ్చే ఏడాది జనవరి 1 నుండి పరిశ్రమలకు విధించిన పవర్‌హాలీడేను ఎత్తివేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ విద్యుత్‌లోటు భారీగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇటు పరిశ్రమలకు , అటు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు లేక రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. మరోవైపు కృష్ణ-గోదావరి (కెజీ)బేసిన్‌లో ఉత్పత్తి తగ్గిపోయిందన్న సాకుతో గ్యాస్‌ సరఫరా తగ్గించడం ఫలితంగా గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి ధర్మల్‌ ప్రాజెక్టులే ఆధారం అయినప్పటికీ వరంగల్‌లోని 500 మెగావాట్ల కెటిపిపి, విశాఖలోని 500 మెగావాట్ల ఎన్‌టిపిసిల్లో నెలకొన్న సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఏపిజన్‌కో ధర్మల్‌ ప్రాజెక్టుల సామర్థ్యం పెరగడంతో గతఏడాది 58 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అందించిన ప్రాజెక్టులు ప్రస్తుతం 98 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండటం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో 10 నుండి 15శాతం వరకు మాత్రమే విద్యుత్‌ కొరతఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ అంతకు రెట్టింపు స్థాయిలోనే కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదా కేంద్ర సహకారాన్ని కోరడం మినహా పరిష్కార మార్గాలు కనిపించడం లేదు. చిన్న,మధ్యతరహా, భారీ పరిశ్రమల మాట అలాఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకాన్ని విద్యుత్‌ కోతలు తీవ్రంగా వేధిస్తున్నాయి.
రాష్ట్రరాజధాని హైద్రాబాద్‌లో సైతం రెండుగంటలు విద్యుత్‌ కోత ఉండగా, జిల్లాకేంద్రాల్లో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, పల్లెల్లో 10 గంటల విద్యుత్‌ కోత అమలవుతోంది. దీంతో పట్టణాలు, పల్లెల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న మిల్లులు, జీరాక్స్‌ సెంటర్లు, పోటో స్టూడియోలు, రిపేరింగ్‌ దుకాణాలు, టైలరింగ్‌ తదితర యూనిట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా యూనిట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌ కొరతతో సినిమా ధియేటర్లు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.7 ఉండగా, జనరేటర్‌ ద్వారా ఒక్క యూనిట్‌కు రూ.14 వరకు ఖర్చు వస్తుండటంతో సినిమాలు ప్రదర్శించిన యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.మరోవైపు విద్యుత్‌ కోతలతో ఆసుపత్రుల్లో రోగులు, చిన్నారులు దోమలబెడదతో పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నా కొన్ని చోట్ల వినియోగించకపోతుండటంతో రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మరోవైపు ఎక్స్‌రే , స్కానింగ్‌ రిపోర్టులకు సైతం రోజల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి.
గొల్లుమంటున్న పల్లెలు
విద్యుత్‌ కోతలు పల్లెప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణాల్లో ఆరుగంటల కోతతో సరిపెడుతున్న అధికారులు పల్లెల్లో మాత్రం అధికారిక, అనధికారికంగా ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో పదిగంటల పాటు అధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తుండగా, గత వారంరోజులుగా రాత్రి వేళల్లోనూ అనధికారికంగా కోతలు పెడుతున్నారు. ఓ వైపు విద్యుత్‌ కోత , మరోవైపు దోమల మోత వెరసి పల్లె ప్రజలునిద్రకు దూరమవుతున్నారు. మరోవైపు, విద్యుత్‌ కోతల కారణంగా పల్లెల్లో తాగునీటి పథకాలు పూర్తిగా పడకేస్తున్నాయి. ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు విధిస్తున్న కోతతోపాటు అనధికారిక కోతలు కూడాతోడవుతుండటంతో రక్షిత మంచినీటిపథకాల మోటర్లు నడవక పల్లె ప్రజల గొంతులు ఎండుతున్నాయి. అదలాఉండగా వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన రైతులు రబీసాగుపై ఆశలు పెట్టుకోగా, విద్యుత్‌ కోతలతో రబీసాగుపై కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లెల్లో రైతులు , ప్రజల కష్టాలు పగవాడికి కూడా రాకూడదన్నట్లుగా మారాయి.
సమ్మె... సాకే
సకలజనుల సమ్మె వల్లే విద్యుత్‌ కోతలు విధించాల్సి వసతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బొగ్గు ఉత్పత్తి లెక్కలను చూస్తే వారి ప్రకటనలు వాస్తవ విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. సింగరేణిలో సమ్మె ప్రభావం కొంతమేరకు చూపిన మాట వాస్తవమే అయినా విద్యుత్‌ కోతలకు పూర్తి కారణం సమ్మె మాత్రమే కాదని తేటతెల్లమవుతోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సింగరేణి ఏరియాల్లో సమ్మెసంపూర్ణంగా సాగినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం కార్మికులు సమ్మెలో పాల్గొనలేదు. 35రోజుల సమ్మె కాలంలో 52లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓసీల్లో 15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. సమ్మె అనంతరం ఆ నష్టం భర్తీచేసుకోవడానికి సింగరేణి యాజమాన్యం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్రంలో 36భూగర్బ, 14ఓపెన్‌ కాస్టు గనులుండగా , గతంలో రోజుకు 1.20లక్షల టన్నుల బొగ్గుఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకునే వారు. అయితే సమ్మె ప్రభావం నుండి కోలుకోవడానికి ప్రస్తుతం 1.93లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం ఈమేరకు ఇప్పటికే సఫలీకృతమైంది. కార్మికుల భోజన విరామ సమయాన్ని కూడా కుదించి బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచడానికి యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టింది.దీంతో సమ్మె ముగిసిన రెండవరోజు నుండే విద్యుత్‌ ప్లాంట్లకు తగ్గబొగ్గు తరలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు పూర్తిగా సమ్మేకారణం అని ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా కనిపించడం లేదు.
మాటతప్పిన కేంద్రం
సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీవ్రంగాఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రానికి 183 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటన కూడా చేసింది. అయితే విద్యుత్‌ కెటాయింపులో మాటతప్పిన కేంద్రం రాష్ట్రానికి ఇస్తానన్న కేంద్రం తమిళనాడు, కేరళలకు మరలించి మనకు మొండిచేయి చూపింది. అయితే కష్టకాలంలో తాను ఇచ్చిన మాటను కేంద్రం తప్పినా రాష్ట్రానికి చెందిన ఆపార్టీ ఎంపిలు గానీ , రాష్ట్రప్రభుత్వం గానీ ఒత్తిడితెచ్చి విద్యుత్‌ను తేవడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన మాట ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రాన్ని చీకట్లు చుట్టుముడుతుండటం, విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటం వంటి గడ్డుపరిస్థితులు నెలకొన్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిగతంలో కేటాయించిన విద్యుత్‌తో పాటు అదనంగా రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు చేయించుకోగలగితే కరెంటు కష్టాలు కొంతమేరకైనా గట్టెక్కవచ్చు.