తెలంగాణాలో త్వరలో జరిగే ఉపఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతను పార్టీ సీనియర్ నాయకుడు టి.దేవందర్ గౌడ్‌కు అప్పగించాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఉపఎన్నికలు జరిగే కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికలు జరిగే నాగర్ కర్నూలు, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ స్థానాలతో పాటు మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో దేవేందర్ గౌడ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపికపై పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఎంపిక బాధ్యతను కూడా దేవేందర్ గౌడ్‌కే చంద్రబాబు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ప్రచారంలో దేవేందర్ గౌడ్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహుల, వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఒక్కో మండలానికి ఇద్దరు నుండి నలుగురు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎల్.రమణ, విజయరమణారావు, గంగుల కమలాకర్‌లను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. నాగర్‌కర్నూల్‌కు దేవేందర్ గౌడ్‌తో పాటు రేవంత్‌రెడ్డి, జైపాల్ యాదవ్, పి.రాములు, ఎర్ర చంద్రశేఖర్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు. మహబూబ్‌నగర్ స్థానానికి ఎల్లారెడ్డి, దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డిలను, కొల్లాపూర్‌కు రావుల చంద్రశేఖరరెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఉమా మాధవరెడ్డిని కూడా ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నారు