18, డిసెంబర్ 2011, ఆదివారం

దళిత రాజకీయాలకు దిక్సూచి ఎవరు?

దళితులకు రాజకీయ అధికారం ఒక్కటే అన్ని సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం అని భారత రాజ్యాంగపిత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 1930లోనే చెప్పారు. నిమ్నజాతులు సొంతశక్తితోనే రాజకీయాధికారాన్ని చేపడితే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావు అని కూడా ఆయన హెచ్చరించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా దళితుల సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదంటే రాజకీయాధికారం వారికి దక్కని కారణంగానే అన్నది డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరికతోనే రుజువవుతున్నది.
75 సంవత్సరాల దళిత రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? ఎటు వెళ్ళాలి అనే అంశంపై హైదరాబాద్‌ నడిబొడ్డున వివిధ ఎస్‌సి, ఎస్‌టి సంఘాలు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సు దేశంలో నెలకొన్న సంకీర్ణ రాజకీయాల్లో దళితులు కీలక భూమికి పోషించే ఈ తరుణంలో ఆత్మపరిశీలన దిశగా దళిత రాజకీయ నాయకులు, ఉద్యమకారులు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మార్గంలో ఏ విధంగా రాజకీయ అధికారాన్ని సాధించాలో, సాధించవచ్చో తన జీవిత కాలంలోనే నిరూపించారు నిజమైన అంబేద్కర్‌ వారసుడు బహుజన పితామహుడు, రాజకీయ బుద్ధుడు అయిన కాన్షీరాం.
నేటి దళిత రాజకీయాలకు ఆయన మార్గం అత్యంత అనుసరణీయం. ఓట్లుమావా? సీట్లు మీవా? ఇకపై చెల్లదు? ఇకపై సాగదు అంటూ దేశంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రాహ్మణ వాద అగ్రకుల మనువాద రాజకీయాల్ని తలక్రిందులుచేసి, మినీ ఇండియాగా పిలువబడే బ్రాహ్మణాధిపత్య కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని తొలిసారిగా తన సొంత కాళ్ళమీద ఒక అంటరాని చమార్‌ అధికారాన్ని సాధించింది. అంటే దాని వెనుక మూడు ముఖ్యమైన అంశాలు కీలకంగా పనిచేశాయి. ఒకటి సొంత రాజకీయ పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతం అంబేద్కరిజం, దాన్ని నడిపించే సమర్థవంతమైన అమ్ముడుపోని నాయకత్వం. ఈ మూడు అంశాలు దళితులు రాజకీయ అధికారాన్ని సాధించడానికి అత్యంత ఆవశ్యం. వీటికితోడు దళితులకు సొంత మీడియా, సొంత అంగబలం, ఆర్థిక బలం కావాలి.
కాన్షీరాం మాటల్లో చెప్పాలంటే, దళితులు అధికారంలోకి రాకుండా అడ్డుపడుతున్న ప్రధాన అంశాల్లో మనీ మాఫియా (అంగబలం) మీడియా (ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌), దళితుల్లో విపరీతంగా పెరిగిన చెంచాగిరి. వీటన్నింటిని ఏకకాలంలో ఎదుర్కొంటూ దళితుల సంఘటితం చేసి, ఓటు విలువను తెలియపరిచి పార్టీ ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌కే అత్యంత శక్తి ఉందని గత 64 సంవత్సరాలు స్వతంత్ర రాజకీయ చరిత్ర నిరూపిస్తున్నది. అందుకే కాన్షీరాం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చూపించిన 'బ్యాలెట్‌' మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని నవంబర్‌ 26, 1949 లో పార్లమెంట్‌కు సమర్పిస్తూ ఒక హెచ్చరిక చేశారు. రాజ్యాధికార ప్రకారం, రాజకీయంగా అందరూ సమానమే. ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకే విలువ కాని,సామాజికం, ఆర్థికంగా అసమానతలు కొన్నివేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక, ఆర్థిక సమానత్వం, రాకుండా రాజకీయ సమానత్వానికి అర్థం లేదు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని దళితులు సాధించాలంటే రాజకీయ అధికారం ద్వారా మాత్రమే సాధిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు గడిచినా, భారత రాజ్యాంగం అమలు అయి 61 సంవత్సరాలు గడిచినా దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించకపోవడానికి ప్రధాన కారణం వారి చేతుల్లో పరిపాలన పగ్గాలు లేకపోవడాన్ని సాధించడానికి డాక్టర్‌ బాబా సాహెబ్‌ చాలా ప్రయత్నాలు చేశాడు.
1936లో ఇండిపెండెంట్‌ పార్టీని స్థాపించాక 1937లో జరిగిన లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నిక 18 మంది సభ్యులను గెలిపించాడు. 1942 లో అఖిల భారత షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ పార్టీ ద్వారా 1952లో శాసన, లోక్‌సభ సభ్యులను గెలిపించారు. 1955 మారుతున్న, దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మ్యానిఫెస్టో రూపొందించారు. 1956 లో ఆయన మరణించినా ఆమె కూడా ఆయన స్ఫూర్తితో 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల శాసన, లోక్‌సభ సభ్యులు ఆ పార్టీ నుండి గెలుపొందారు. తర్వాత కాలంలో మహారాష్ట్రలో ఆయన అనుచరులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సిద్ధాంతం గొప్పదే కాని ఓట్లు రావు, సీట్లు రావు, అధికారం అసలే రాదు. స్వయంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఓడిపోవడం ద్వారా అది రుజువైంది కాబట్టి దళితులు ఆర్‌పిఐ ని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇతర ప్రముఖ పదవులు అనుభవించారు. ఇంకా అనుభవిస్తూ ఉన్నారు.
డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కల్పించిన రోజు రిజర్వేషన్ల కారణంగా నేడు దళితులే కాక, ఇతర వెనుకబడిన, మైనారిటీ వర్గాలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులుగా, ఎంఎల్‌ఎ, ఎంపిలుగా కాక రాష్ట్రపతి, పార్లమెంట్‌, అసెంబ్లీ స్పీకర్‌లుగా అనేకమైన అత్యున్నత పదవులు పొందారు. దళిత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండగా మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారికి సైతం ఆత్మగౌరవం దక్కడం లేదు. అందుకు ప్రధాన కారణం దళితులు తమ సొంత పార్టీ ద్వారా కాక, అగ్రకుల పార్టీల ద్వారా అవకాశాలు పొందుతుండడం వలన వారి చెప్పుచేతల్లో ఉండాల్సిన పరిస్థితి. అందుకే కాన్షీరాం సొంత కాళ్లపై నడువు అసెంబ్లీ, పార్లమెంటు మెట్లు ఎక్కు అని నినాదం ఇచ్చారు. తన ఆ నినాదం డా|| అంబేద్కర్‌ 1930 సంవత్సరాలుగా ఇచ్చిన నినాదమే. అందుకే ఆయన 1984లో బి.ఎస్‌.పి స్థాపించి 1989లోనే డాక్టర్‌ అంబేద్కర్‌ నినాదానికి ఓట్లే కాదు సీట్లు కూడా వస్తాయని నిరూపించారు.