18, డిసెంబర్ 2011, ఆదివారం

మనమే తాగిద్దాం

నూతన ఎక్సైజ్‌ సంవత్సరం నుంచే కొత్త అబ్కారీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. నేరుగా ప్రభుత్వమే రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అక్రమ మద్య వ్యాపారం, పన్ను ఎగవేత, ధరల నియంత్రణలతోపాటు మద్యం మాఫియాను కట్టడి చేసే అవకాశాలుంటాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సిబిఐ, విజిలెన్స్‌ శాఖలు మద్యం సిండికేట్‌లపై దాడులు నిర్వహిస్తున్నాయి. రైస్‌ మాఫియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తోంది. తమకనుగుణంగా చట్టాల్ని మార్చుకుంటోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పొందుతోంది. ఇప్పుడు రైస్‌మాఫియాను కూడా మద్యం మాఫియా మించిపోతోంది. మద్యం అక్రమవ్యాపారంతో కొందరు కోట్లకు పడగలెత్తారు. వీరంతా రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు భారీగా ముడుపులిస్తున్నారు. గెలిచినవారిని తమకనుకూలంగా మలచుకుంటున్నారు. వారిని చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. పరోక్షంగా ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికీ, వీరికి పెట్టుబడి పెట్టడం కంటే తామే నేరుగా చట్టసభలకు పోటీ చేయాలన్న ఆలోచన పలువురు అక్రమ మద్యవ్యాపారుల్లో చోటు చేసుకుంది.తద్వారా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పెత్తనం చేసి తమ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలని వీరు ఆశిస్తున్నారు. ఇప్పట్లా కొందరు ప్రభుత్వ పెద్దలకు నెలనెలా మామూళ్ళివ్వడం, వ్యాపారాల్లో వాటాలివ్వడం, పదే పదే వారికి మొరపెట్టుకుని అధికారులపై ఒత్తిళ్ళు తేవడం కంటే నేరుగా తామే అధికారుల్ని ఆదేశించే స్థానంలోకెళ్ళడం వీరి లక్ష్యంగా తెలుస్తోంది. మాదకద్రవ్యాలు, మద్యం మాఫియా ఇంతవరకు సమాజానికి చేటుగా డవించేవారు. కానీ ఇప్పుడు వీరు ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవస్థ పునాదుల్ని కదిపేస్తున్నారు. గతంలోకూడా మద్యం మాఫియా దేశాన్ని అతలాకుతలం చేసింది. అనేక రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ప్రదర్శించింది. వీరిని అణచివేసేందుకే ప్రభుత్వాలు పలురకాల ఆలోచనల్ని అమలు చేశాయి. కొన్ని దశల్లో మద్య నిషేధాన్ని కూడా ప్రవేశపెట్టాయి. భారీగా సమకూరే అబ్కారీ ఆదాయాన్ని కూడా పక్కనపెట్టేసి సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నించాయి. కానీ అధికారుల వైఫల్యంతో అనధికార మద్యం వెల్లువెత్తింది. కల్తీసారా విజృంభించింది. ఇది ప్రజల ప్రాణాలకు చేటుతెచ్చింది. మద్యం మాఫియా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమమార్గాల్లో మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసింది. కోట్లకు కోట్లు సంపాదించింది.
ఒక దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపే స్థాయికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్‌ మూడోసారి అధికారంలోకి రాగానే తొలి సంతకాన్ని మద్యనిషేధ దస్త్రంపైనే పెట్టారు. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసింది. మరికొంతకాలం నిషేధం అమలైతే మద్యం మాఫియా శక్తికి ప్రభుత్వం కూడా తల వంచక తప్పదని చంద్రబాబు గుర్తించారు. అంచెలంచెలుగా నిషేధాన్ని తొలగించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం టోకు వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డిస్టిలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11,300కి పైగా మద్యం దుకాణాలకు బహిరంగ వేలం పద్ధతిలో అనుమతులిచ్చింది. వీటికి పదిరెట్లకు పైగా బెల్ట్‌షాపులు వెలిశాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి జీరో బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. వీటి అమ్మకాలపై పన్ను ఎగవేస్తున్నారు. మరోవైపు సిండికేట్‌గా ఏర్పడి ధరల్ని తమ అదుపులో పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మద్యం వ్యాపారంలోకి దిగితే సమాజంలో చులకనౌతారని భావించేవారు. కాగా ఇప్పుడదే ప్రతిష్ఠాత్మక వ్యాపారంగా మారింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి ఇలా పార్టీలతో సంబంధంలేకుండా నేతలంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మద్యంవ్యాపారంలోకి ప్రవేశించారు. అందులోనే కాసులు గడిస్తున్నారు. దాన్నే రాజకీయాలకు పెట్టుబడిగా పెడుతున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా దీన్నే ప్రధాన ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయక పోతే 2014ఎన్నికల్లో మద్యం సిండికేట్‌లు, వ్యాపారులతో పోటీకి దిగడం కష్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోలేమన్న భయం కొందరు పాలకుల్లో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 5వేలకోట్లకు పైగా షాపుల వేలం ద్వారా అబ్కారీ ఆదాయం లభిస్తోంది. మరో 7వేల కోట్లు హోల్‌సేల్‌ వ్యాపారం, ఎక్సైజ్‌ డ్యూటీ, అమ్మకపు పన్ను ద్వారా సమకూరుతోంది. బడ్జెట్‌లో సింహభాగాన్ని సంపాదించి పెడుతున్న అబ్కారీని నిర్లక్ష్యం చేయకుండానే క్రమబద్ధీకరించి తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన విధానాల్ని పాలకులు అధ్యయనం చేస్తున్నారు. గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికీ సంపూర్ణ మద్యనిషేధం అమలౌతోంది. రెండేళ్ళ క్రితం గుజరాత్‌లో కల్తీసారా మరణాలు జరగడంతో మద్యంప్రియుల కోసం పర్మిట్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా గిరిజనుల్లో మద్యం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ నాగాలాండ్‌, మిజోరం ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని అనుమతించడంలేదు. ఢిల్లీలో టోకు, చిల్లర వ్యాపారాలన్నీ ఆ రాష్ట్రప్రభుత్వమే చేస్తోంది. ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారానే వినియోగదారులకు విక్రయిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఈ వ్యాపారం సాగుతోంది. నిర్ణీత వేళలు, ధరల్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. కేరళలో మద్యం వినియోగం బాగా ఎక్కువ. ఆ రాష్ట్ర ఆదాయంలో 40శాతం అబ్కారీ ద్వారానే సమకూరుతోంది. ఒకప్పుడు అక్కడ ప్రైవేటు వ్యాపారులుండేవారు. వారంతా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఎదగడంతో మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రతి 80వేలమందికి ఒక దుకాణం చొప్పున 337షాపుల్ని ఆ రాష్ట్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. వారానికి ఏడురోజులూ ఉదయం 8నుంచి రాత్రి 10గంటల వరకు అక్కడే అమ్మకాలు సాగిస్తున్నారు.దీంతో వ్యాపారం పెరగడమే కాకుండా ఆదాయం గణనీయంగా వృద్ధి అయింది. 1984లో ప్రభుత్వం చేపట్టే నాటికి కేరళలో అబ్కారీ ఆదాయం 60కోట్లుంటే 2010నాటికది 5వేలకోట్లకు చేరుకుంది. వీటన్నింటిని పరిశీలిస్తున్న పాలకులు ఇదే విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే మద్యం మాఫియా అక్రమాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని భావిస్తున్నారు.