30, అక్టోబర్ 2010, శనివారం

నిబంధనలకు నీళ్ళు ... పేలనున్న టపాసులు

దీపావళి పండగ సమీపిస్తున్న కొద్దీ బాణసంచా విక్రయాలు పెరిగిపోతున్నాయి. యజమానులు అమ్మకాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. అయితే ఇక్కడ వున్న సమస్య అంతా ఒక్కటే నిబంధనల ఉల్లంఘన. శివారు ప్రాంతాలతో పటు నగరంలోని పలుచోట్ల ప్రభుత్వ అనుమతితో హోల్‌సేల్ మందుగుండు దుకాణాలు నడుస్తున్నాయి. ఐతే అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన నిబంధనలకు అనుగుణంగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా 10, 15 మినహా మిగిలిన దుకాణాలన్నీ అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తూ తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి యజమానులు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం నిబంధనలకు పాతర వేస్తున్న దుకాణాదారులపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకొనేకంటే ముందుగాని నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.