డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని ఎం.డి. (ఆయుర్వేద), ఎం.డి. హోమియో, ఎం.డి. యునాని కోర్సుల్లో 2010 -11 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి ఈనెల 30వ తేదీ నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసు కొనేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది . ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి నవంబరు 8వ తేదీ సాయంత్రం వరకూ వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌చేసుకోని, వివరాలను పూర్తి చేసి దరఖాస్తులు పంపించాలి.
ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం సైట్ ద్వారా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పూర్తి చేసి వర్శిటీకి పంపించాలి. దరఖాస్తులు అభ్యర్థులు స్వయంగా గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులయితే రూ.450లు, ఇతర కేటగిరికి సంబంధించి అభ్యర్థులయితే రూ.600లు ఏదైన జాతీయ బ్యాంకు ద్వారా డిమాండు డ్రాప్టు తీసుకొని పంపించాలి. డిడిని డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎపి పేరుతో విజయవాడలో చెల్లేవిధంగా తీయాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులు నవంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వర్శిటీకి అందే విధంగా పంపించాలి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసిన తరువాత గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేసి పంపించాలి. దరఖాస్తుపై 'ఎండి (ఆయుర్వేద) ఇటి - 2010' అని రాయాలి. అదే హోమియో అయతే ఎండి (హోమియో) ఇటి - 2010 అని, యునాని అయితే ఎండి (యునాని) ఇటి -2010 అని తప్పకుండా రాయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ది కన్వీనర్, పోస్టు గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కమిటీ, డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఎపి విజయవాడ - 520 008. అనే చిరునామాకు పంపాలి. అభ్యర్థులు స్వయంగా కూడా పంపించవచ్చు.
ఎండి (ఆయుర్వేద), ఎండి (హోమియో), ఎండి (యునాని) కోర్సులకు సంబంధించి నవంబరు 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ఇతర వివరాలు, నమూనా పరీక్షా పత్రం వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షకు సంబంధించి నవంబరు 18వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఆయా కోర్సులకు సంబంధించి హాల్‌టికెట్లను వర్శిటీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అంతకన్నా ముందే అభ్యర్థులకు స్వయంగా వర్శిటీ పోస్టు ద్వారా ఎన్‌టిఆర్ ఆరోగ్య, వైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పంపిస్తుంది.