పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి సత్యసాయి ట్రస్టుకు చెందినదిగా భావిస్తున్న నగదు తరలింపు వ్యవహారంలో ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీచేశారు. పోలీసులు చక్రవర్తికి ఓ లేఖ కూడా రాశారు. యజుర్వేద మందిరం నుంచి వచ్చి వెళ్లే వాహనాల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇవ్వాలని పోలీసులు ఆయనకు లేఖలో సూచించారు. ఇప్పటికే ఇద్దరు ట్రస్టు సభ్యులకు నోటీసులిచ్చిన పోలీసులు తాజాగా కార్యదర్శికి సైతం అందజేశారు. నోటీసు అందుకున్న ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ అనారోగ్య కారణాల రీత్యా శనివారం విచారణకు రాలేనని సోమవారం వరకు గడువు కోరగా పోలీసులు అనుమతించారు. రత్నాకర్ శనివారం పోలీసుల ముందు హాజరు కానున్నారు. శుక్రవారం రత్నాకర్ డిఎస్పీని కలిశారు. కాగా మరో వ్యక్తి సదాశివన్ కోసం పోలీసులు బెంగుళూరులో గాలిస్తున్నారు.
ఇక కొడికొండ చెక్‌పోస్టు వద్ద పట్టుపడిన నగదుని తమకు స్వాధీనం చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు హిందుపురం కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే డబ్బు తరలిస్తూ పట్టుపడిన ముగ్గురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇవాళ అదే కోర్టులో విచారణ రానుంది. శ్రీనివాసన్ వ్యక్తిగత సహాయకుడు వెంకటేషన్‌ను పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు.