సెల్ ఫోన్ ప్రేమాయణం ఓ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పారాపట్టికి చెందిన తిరుపతి అనే 35 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం విలుపురం జిల్లా తిరక్కోవిలూరుకు చెందిన మేరి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరువురు తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. నిత్యం మేరీతో మాట్లాడుతున్న తిరుపతి ఆమె ప్రేమలో పడి పోయాడు. ఆమెతో నిత్యం కబుర్లు చెప్పేవాడు. అయితే రెండేళ్లుగా మేరీతో మాట్లాడుతూ ప్రేమలో మునిగి పోయిన తిరుపతికి తన ప్రేయసి ఎలా ఉందో చూడాలనిపించింది. అంతే తడవుగా ఇటీవల మేరీ చిరునామాను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లాడు.
తీరా అక్కడకు వెళ్లాక ఆమె వయసు అరవై సంవత్సరాలు అని తెలిసి తిరుపతి ఖంగు తిన్నాడు. దీంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. అదే జిల్లాలోని హోగినెకల్ శివారులో గురువారం సాయంత్రం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా తిరుపతి ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. గస్తీ పోలీసులు దానిని గమనించి తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారించారు.