24, జూన్ 2011, శుక్రవారం

చంద్రబాబుకి మరో షాక్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగులబోతోంది. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకులే స్వయంగా ఆ విషయాన్ని చెబుతున్నారు. తాను జగన్‌తో చర్చలు జరపలేదని, తన కుమారుడికి జగన్‌తో వ్యాపార సంబంధాలు లేవని ఉమ్మారెడ్డి నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వారు వినడం లేదు. చంద్రబాబుపై అలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సరిగా పార్టీ కార్యాలయానికి రావడం లేదు.

తన బాధేమిటో తెలుసుకోవడానికి చంద్రబాబు కనీసం మాట్లాడడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోయేవాడితో మాటలేమిటని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇతర నాయకుల పట్ల వ్యవహరించినట్లుగానే చంద్రబాబు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విషయంలో వ్యవహరిస్తున్నారు. అంటే, అసంతృప్తితో ఉండిపోయే నాయకులను పట్టించుకోకపోవడమన్న మాట.