4, మార్చి 2011, శుక్రవారం

జగన్ బలపడడానికి కారణమని మెయిలీని పీకి పారేశారు....

తెలంగాణా ఏర్పాటుపై ఏదో ఓ నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని యావత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎదురు చూస్తుంటే... కాంగ్రెస్‌ అధిషానం మాత్రం పార్టీలో ప్రక్షాళన ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన వీరప్ప మొయిలీ.. వై.ఎస్.జగన్ పట్ల చాలా మెత్తగా వ్యవహరించడం వల్ల జగన్ బాగా బలపడడానికి పరోక్ష కారణం కావడం వంటి అంశాలవల్ల ఆయనను మార్చి ఆయన స్థానంలో గతంలో ఇన్‌ఛార్జిగా పనిచేసిన గులాంనబీ ఆజాద్‌ను నియమించారు. అలాగే ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై నిప్పులు చెరిగి, ఆమె దేశీయతని ప్రశ్నించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వం నుంచి జి. వెంకటస్వామికి ఉద్వసన చెప్పారు.

కాగా తెలంగాణా వాదాన్ని బలంగా వినిపిస్తునే... అధినేతికి విధేయుడిగా ఉన్న సైతం సిడబ్ల్యూసి నుండి కె. కేశవరావుని తొలగించడం ఆశ్చర్యకరం ...అలాగే సీమాంధ్ర ప్రాంతాల నుండి ఎంపీలుగా ఉండి ఎలాంటి వాదనలు వినిపించని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ లను కూడా తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బి. సంజీవరెడ్డిని, మరోవైపు అధిష్టానం ప్రసన్నం పొందిన సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి, అధినేత్రిపై ఈగ వాలనీయకుండా చూసే వి. హనుమంతరావుకు కార్యదర్శులుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి.) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది.