8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం...

ఓ వృద్ధుడు.. ఏడు పదుల వయసు మీద పడుతున్న యోధుడు! ఆయన ఒంటిపై తెల్లని దుస్తులు... స్వచ్ఛమైన ఆయన వ్యక్తిత్వంలానే! ఒక్కడే వచ్చాడు.. ఆర్భాటాల్లేవు... ఆడంబరాల్లేవు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూర్చున్నాడు. దేశ జవసత్వాలను పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి భూతంపై బిల్లు ఎక్కు పెట్టాడు! చినుకు చినుకు కలిసి.. తుదకు వరదైనట్లు.. ఒక్కొక్కరు చేతులు కలిపారు. ఉత్తుంగ తరంగాలయ్యారు! అక్రమార్జనలపై ఉప్పెనయ్యారు. అందుకు స్ఫూర్తిగా నిలిచాడు సత్యాగ్రహాల గాంధేయవాది.. అన్నా హజారే!

ఆయన పిలుపందుకుని.. హిమాచలం మొదలు కన్యాకుమారి దాకా జన ప్రభంజనం పోటెత్తింది. ప్రభువుల అవినీతి ఇంకానా ఇకపై సాగదంటూ నినదించింది! రాజకీయ జెండాల్లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. మాటల తూటాలే! ఒకటే లక్ష్యం... అవినీతి రహిత భారతం! ఆగని పయనం.. లంచగొండితనాన్ని తుదముట్టించేంత వరకూ! మరణించేదాకా పోరు.. భారతమ్మను పాప పంకిలం నుంచి బయటపడేసేందుకు! అవినీతిపై పోరాటానికి ఇప్పటిదాకా కోటలు దాటని మాటలే. ఇప్పుడు చేతలు ఉద్యమాలయ్యాయి.

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం... అవినీతి నేతలపై.. సొంత జలగలపై! దేశం నలు దిక్కులా అగ్గి రగిలించింది... హస్తినలో సెగలు పుట్టించింది! విపత్తు వచ్చినంతగా ఢిల్లీ పీఠం కలవరపడింది! భీష్మించుకున్న సర్కారు కాస్తంత మెడలు వంచింది! అవినీతిపై పవిత్ర యుద్ధానికి సమర భేరీ మోగించిన హజారే డిమాండ్ల పరిశీలనకు అయిష్టంగానే అయినా తలూపింది. అవినీతిపై పాశుపతాస్త్రంగా ఉండాలని ఆశిస్తున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనకు పౌర సమాజానికి సగ భాగం కట్టబెట్టింది!