26, సెప్టెంబర్ 2012, బుధవారం

అంతరిస్తున్ననగర పచ్చదనం

నగర పచ్చదనంపై నిర్లక్ష్యపు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాల కింద మహా వృక్షాలు మాయమవుతుంటే కొత్తగా చెట్లు నాటేందుకు ఎవరికీ చేతులు రావడంలేదు. సుమారు కోటి మంది జనాభా గల నగరంలో పచ్చదనం ప్రశ్నార్థకంగా మారుతోంది. పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని అడవులతో పాటు, మహా వృక్షాలను సైతం నరికివేయడంతో జీవరాశుల మనుగడ ప్రశ్నార్తకంగా మారుతోంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా కాలుష్యం పెరిగి నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. పర్యావరణ సమతుల్యత పాటించాల్సిన అధికార యంత్రాంగం మానవాళికి మేలు చేసే చెట్లను నరికి నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మర్చివేస్తున్నారు. వృక్ష సంపద అంతరించడం వల్ల జరిగే నష్టాన్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనీ, ఫలితంగా కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని సేవ్ కన్వీనర్ విజయరాం అన్నారు.

మహా వృక్షాలు మాయంనగరంలో చేపట్టిన పలు నిర్మాణాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే వృక్షాలను నరికి బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా పచ్చదనం నాశనమై నగరం కాంక్రీట్ జంగిల్ మారుతోంది. మొక్కల పెంపకానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న హెచ్ఎండీఏ ఆ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటోంది. ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా వందల ఏళ్లనాటి మర్రి, వేప, కానుగ చెట్లను సుమారు 400పైగా తొలగించారు. ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశమున్నా ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. బెంగళూరు, విజయవాడ హైవేలపై ఒకనాడు కనిపించిన మహా వృక్షాలు కనుమరుగయ్యాయి. గతం లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం సందర్భంగా వందల వృక్షాలను తొలగించారు. వాటిలో సుమారు 40కి పైగా చెట్లను ప్రైవేటు వ్యక్తులు తీసుకోవడం గమనార్హం. విస్తరణలో భాగంగా...నగర విస్తరణలో భాగంగా చుట్టూ ఉన్న అడవులను నరికి నిర్మాణాలు చేపట్టారు. భారీ పరిశ్రమలు, సెజ్‌ల నిర్మాణంలో వందల చెట్లను నరికి వేశారు. ఫలితంగా ఆయా చెట్లపై ఆధారపడి జీవించే లక్షల జీవులు అంతరించాయి. నగరం చుట్టూ ఒకప్పుడు వందల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుండేది. ఫాం హౌస్‌లు, కాలేజీలు, సెజ్‌ల పేరిట వందల ఎకరాల్లో సాగును ధ్వంసం చేసి, కంచెలు నిర్మించుకుంటున్నారు. వృక్ష, జంతుజాలం అంతరించడం మూలంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోందని 'ఆంత్ర' సంస్థకు చెందిన ఆశాలత అంటున్నారు.

పెరుగుతున్న కాలుష్యంకార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ అందించే మొక్కలు నరికివేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. నగరంలో పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం మూలంగా ప్రజలకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించే ఉద్యానవనాల పట్ల సైతం హెచ్ఎండీఏ లాంటి సంస్థలు నిర్లక్ష్యం వహించడం మూలంగా కాలనీలలో పచ్చదనం నశిస్తోంది. మొత్తంగా మనిషి మనుగడకు ఉపయోగపడే, ఒకనాడు నగరంలో విరివిగా కనిపించిన మర్రి, వేప, చింత, కానుగ లాంటి వృక్షాలు కానరాకుండా పోయాయి. నగరంలో జీవవైవిధ్య సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆర్భాటం సంవత్సరం పొడువునా పచ్చదనాన్ని కాపాడడంపై చూపాలని నగర వాసులు కోరుతున్నారు.