18, నవంబర్ 2010, గురువారం

ప్రధానిని ఉత్సవ విగ్రహంగా మలిచి.... దోచుకు తింటున్నారు

నిస్వార్థ చరిత్ర ఉన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఉత్సవ విగ్రహంగా మలిచి, కాంగ్రెస్ నాయకులు దేశాన్ని దోచుకు తింటున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.

రాష్ర్టంలోను, కేంద్రంలోను అసమర్థ ప్రభుత్వం కొనసాగుతోందని, కుంభకోణాల పరంపరను కొనసాగిస్తోందని కాంగ్రెస్ హయాంలో బయటపడిన ఎమ్మార్, మైనింగ్, సెజ్ కుంభకోణాలపై ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. క్రీడలతో సహా అన్ని రంగాల్లో కుంభకోణాల పరంపర కొనసాగుతుందన్నారు. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌లో రూ.173 కోట్ల కుంభకోణం వెలుగు చూసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసినా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

కుంభ కోణాలను ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు..