ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, డిజిపి అరవిందరావు హైదరాబాదును ఫ్రీజోన్ గా ఉంచాలని కుట్ర పన్నుతున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు టి హరీష్ రావు ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఫ్రీజోన్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఆ తర్వాతనే ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయలేని హోంమంత్రి సబితారెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫ్రీజోన్, తెలంగాణ అంశాలపై కలిసి రావాలన్నారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అనుకుంటే ఆ పరీక్షలు ఎంత మాత్రం జరగనివ్వమన్నారు. మాకు తెలంగాణ ఎంత ముఖ్యమో హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని హరీష్ రావు అన్నారు .