3, మార్చి 2011, గురువారం

'హెల్‌'చల్‌-సెల్‌

''ఏంట్రా... పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌. మర్యాదగా నేను చెప్పినట్లు వింటావా? కాళ్లూ చేతులూ విరగ్గొట్టమంటావా'' అని బస్సులో చివరి వరసలో మాటల తూటాలు పేలడం విని, ముందు వరసలో కూర్చున్న మీరు... అక్కడ ఏదో యుద్ధం ప్రారంభం కాబోతుందని కంగారు పడితే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే! అది సెల్‌ఫోన్‌ బాగోతమై ఉంటుంది!!

గంటల తరబడి తన ప్రియుడితో సెల్‌ఫోన్‌లో శృంగార సంభాషణ చేసే అమ్మాయికి గానీ, అప్పు వసూలుకు ఫోన్‌ ద్వారా భయంకర హెచ్చరికలు చేసే ఆసామీకి గాని -తాము తోటి ప్రయాణీకులకు ఈ తరహా శబ్దకాలుష్యం ద్వారా బోలెడంత అసౌకర్యం కలిగిస్తున్నామనే 'కనీస జ్ఞానం' కూడా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఇలాంటి సందర్భాలలోనే టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ మీద అనవసరంగా ఆగ్రహం కలుగుతుంది. ఆయన పుట్టినరోజు (3.3.1847) సందర్భంగా సంతోషించడానికి బదులు విచారం కలుగుతుంది!

తాజా బడ్జెట్‌ ప్రభావం వల్ల మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గే 'ప్రమాదం' ఉంది కాబట్టి, ఇక కొత్తగా కొనుక్కునే వాళ్లు రెచ్చిపోతే, పరిస్థితి ఎలా ఉంటుందో... ఏమో!

ఒక మిత్రుడు ఆ పరిస్థితిని ఇలా కూడా ఊహించాడు. బిచ్చగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఏయే ఏరియాలకు వెళ్లాలో మాట్లాడుకుని ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటారట. ఎక్కడైనా పెళ్లి లేదా అలాంటి వేడుక సందర్భంగా భోజనాలు గట్రా ఉంటే, ఆ సంగతి తక్కిన వాళ్లకు 'సెల్‌' ద్వారా తెలియజేసేలా 'జెంటిల్‌మన్స్‌ అగ్రిమెంట్‌' చేసుకుంటారట!

సెల్‌ఫోన్‌ చేత్తో పట్టుకుని మాట్లాడడానికి కూడా బద్ధకించే పెద్దమనుషులకు ఓ సదుపాయం ఉంది. మెడకు వైర్లు లాంటివి చుట్టుకుని ఉన్నవాళ్లు రోడ్డుమీద -గట్టిగా మాట్లాడుకుంటూ, చేతులతో పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ వెళ్తుంటే, ఇదంతా సెల్‌ఫోన్‌ సంభాషణ అని తెలియని అమాయకులు 'పాపం.. పిచ్చోడిలా ఉన్నాడు' అని సానుభూతి చూపడమూ కద్దు. ఈ సెల్‌ఫోన్లు సినిమాల్లో కామెడీ ట్రాక్‌లు (హాస్యం విడిగా రాసి, తీసి కలపడన్నమాట!) రాసేవాళ్లకి మంచిచేసే 'ప్రమాదమూ' ఉంది. ఉదాహరణకు ఒక చిత్రంలో ఋణదాత అప్పుతీసుకున్న వాణ్ణి చివాట్లు పెడుతూ వస్తుంటే, ''నేను ఊళ్లోలేను స్వామీ... రాగానే ఇచ్చేస్తానుగా అంటూ ఋణగ్రహీత సమాధానం చెబుతూ వస్తుంటే -ఇద్దరూ ఒకరి కొకరు ఎదురవుతారు!

ఇక టెలివిజన్‌ సీరియల్స్‌లో ప్రధానపాత్రధారులెవరైనా షూటింగ్స్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు -తప్పనిసరిగా 'ఎపిసోడ్‌' టెలికాస్ట్‌కు అందించాల్సి వచ్చినప్పుడు -రచయిత, దర్శకులను ఈ టెలిఫోనే కాపాడుతుంది!

ఇవతల ఉన్న పాత్రధారి టెలిఫోన్‌ పట్టుకుని -తన 'గోడు' వెళ్లబోసుకుంటూ, అవతలి పాత్రధారి తరఫున జరిగే కథను తానే చెబుతుంటాడు. ''ఏమిటి... అనసూయ నిన్ను అంతమాట అందా. దాంతో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా... దిలీప్‌ నువ్వేనా ఆమాట అంటున్నది. మనం టాంక్‌బండ్‌ మీద కూర్చుని, ఒకపక్కన హుసేన్‌సాగర్‌ కంపుకొడుతున్నా కూడా... భవిష్యత్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం... ఎన్ని పథకాలు వేసుకున్నాం... అవన్నీ ఆ హుసేన్‌సాగర్‌లో కలిసిపోవలసిందేనా... అన్నట్లు ఆ రోజు జరిగిన సంగతి నీకు గుర్తుంది కదూ... (ఇది వరకు ప్రసారమైన ఒకటి రెండు సీన్లు ఫ్లాష్‌బ్యాక్‌లా మళ్లీ వేసేస్తే, మరికాస్త సమయం కలిసొస్తుంది!.. మరి మన ఆశలు, ఆశయాలు ఫలించాలంటే నువ్వు బ్రతికి తీరాలి దిలీప్‌... బ్రతికి తీరాలి...'' అని అలా ఆ 'ఏకపాత్రాభినయం' సాగుతూనే ఉంటుంది!

ఆ విధంగా గ్రాహంబెల్‌ గారి టెలిఫోన్‌ వల్ల ఆ తర్వాత సోదరుడిగా వచ్చిన సెల్‌ఫోన్‌ వల్ల ఈ ప్రపంచానికి ఎంతమంచి జరిగిందో, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వారివల్ల అంత చెడు కూడా జరుగుతోంది. సెల్‌ఫోన్‌లో ఇలా 'అధిక ప్రసంగం' చేస్తే తొందర్లోనే నరాలు దెబ్బతిని, తొందరగా చచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ఎవరూ వినడం లేదు! సెల్‌ ద్వారా 'హెల్‌'కు వెళ్దామనే వారి కోరిక కాబోలు!