13, మార్చి 2012, మంగళవారం

స్వరబ్రహ్మ'మామ' మహదేవన్‌ జయంతి మార్చి 14.

స్వరబ్రహ్మ'గా తెలుగు ప్రజల నుండి, 'తిరై ఇసై తిలగం'గా తమిళ ప్రజల నుండి ప్రశంసలు పొందారు కె.వి. మహదేవన్‌. మెలోడీ పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆయన సంగీత దర్శకత్వం నెరపిన చిత్రాల్లో సమిశ్రమమై ఆ చిత్ర విజయానికి తోడ్పడేవి. పాటల కారణంగానే హిట్టయిన చిత్రాలే కాదు, పాటల కోసమే పదేపదే ప్రేక్షకులు సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఎక్కువే అంటే అది మహదేవన్‌ మహాత్యమే. సాహిత్యానికే పెద్దపీట వేసి, సాహిత్యం అర్థం తెలుసుకుని, మాటలు వినబడేలా ట్యూన్లు కట్టి మెప్పించే వారే తప్ప ట్యూన్‌ యిచ్చి పాట రాయమని ఆయన ఏ పాటల రచయితనీ కోరలేదు. ట్యూన్‌ కుదరడం లేదని పాటలోని పదాలు మార్చమని అడిగిన సందర్భమూ ఆయన కెరీర్‌లో ఎప్పుడూ ఏర్పడలేదు. మహదేవన్‌కి ఇంత పేరు రావడంలో తెలుగు బాగా తెలిసిన మలయాళీ పుహళేంది సహకారం ఎక్కువే. అందుకే పుహళేందిని తనతో సమానంగా గౌరవించేవారు. అది గమనించి ఇతరులూ మహదేవన్‌తో పాటు పుహళేందికీ అంతే మర్యాద గౌరవం ఇచ్చేవారు.
''సినిమా పాట ఎలా వుండాలి, ఏది అవసరమో గ్రహించి, ఏ గాయనీ గాయకులైతే ఆ పాటలకు న్యాయం చేయగలరో గుర్తించి, ఆ పాటను గాయనీ గాయకులు అనుభవించి పాడేలా చేసేవారు. అంతేకాదు ఆయన పాటలు సామాన్యుడు సైతం పాడుకుని పులకించి పోయే తీరులో వుండేది'' అనేవారు గాయకుడు బాల సుబ్రహ్మణ్యం.
సంగీత దర్శకుల్లో సి. రామచంద్రని బాగా ఇష్టపడిన మహదేవన్‌ ''ఏ రాగంపైనా ప్రత్యేకమైన అభిమానం లేదు. పాటని బట్టి అది ఏ రాగంలో ట్యూన్‌ చేస్తే బాగుంటుందో ఆ రాగానికి ప్రాధ్యాన్యత ఇస్తూంటాను. చిత్రంలోని సన్నివేశాలను బట్టి ఏయే ఎఫెక్ట్‌లు కావాలో దర్శకుడు చెప్పాక వాటిననుసరించి ఆయా ఎఫెక్ట్‌లు రావడానికి కృషి చేస్తాము. దర్శకుడు సహకారం ఎంత ఎక్కువగా ఉంటే మా కృషి ఆ ప్రకారం వుంటుంది. ప్రేక్షకులు, శ్రోతలు ఎలాటి పాటలను ఎక్కువ ఆదరిస్తే ఆ తరహాలోనే పాటలు కూరుస్తుంటారు సంగీత దర్శకులు సాధారణంగా'' అని చెప్పేవారు.
బాబూమూవీస్‌, జగపతి, యువచిత్ర, భార్గవ్‌ ఆర్ట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ వంటి పలు నిర్మాణ సంస్థలు, ఆదుర్తి, బాపు, కె. విశ్వనాథ్‌ వంటి దర్శకులు మహదేవన్‌కే సంగీత దర్శకత్వం బాధ్యతలు అప్పగించడంలో ప్రాధాన్యత యిచ్చేవారు. యువచిత్ర అధినేత కె. మురారి అయితే మహదేవన్‌ తన చిత్ర సంగీత దర్శకుడని, మార్చే ప్రస్తే లేదని తెగేసి చెప్పడమే కాకుండా మహదేవన్‌ సంగీతం చేయకుండా చిత్రమే నిర్మించనని అంటూ ఆ మాట నిలబెట్టుకున్నారు.
మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, విచిత్ర బంధం, దాగుడుమూతలు, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, దసరాబుల్లోడు, అదృష్టవంతులు, ఏకవీర, సాక్షి, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, ముత్యాలముగ్గు, గోరంత దీపం, ఉండమ్మా బొట్టుపెడతా, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభలేఖ, శ్రుతిలయలు, సిరివెన్నెల, వీరాభిమన్యు, సుమంగళి, మాతృదేవత, మనుషులు మారాలి, లక్ష్మీ నివాసం, సోగ్గాడు, సెక్రెటరీ, ప్రేమ్‌నగర్‌, ప్రేమమందిరం, అడవిరాముడు, గోరింటాకు, త్రిశూలం, నారీ నారీ నడుమ మురారి, మంగమ్మగారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, శ్రీనివాస కల్యాణం ఇలా అనేక చిత్రాలు హిట్‌ కావడంలో మహదేవన్‌ కూర్చిన సంగీతం ఎక్కువ దోహదపడింది. 'మామ' మహదేవన్‌ జయంతి మార్చి 14.

చురకలేసే దాసం గోపాలకృష్ణ

చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకం రాసి, మంచిపేరు తెచ్చుకున్న రచయిత దాసం గోపాలకృష్ణ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ నాటకం ఆధారంగా జయచిత్ర టైటిల్‌ రోల్‌ పోషించగా 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' చిత్రం విడుదలై విజయం సాధించింది కూడా. చిలకా గోరింక, రాగజ్వాల, పున్నమిదేవి వంటి నాటకాలు కూడా ఆయనకు పే తెచ్చాయి. హాస్యంతో సాంఘిక సమస్యలపై చురకలు వేసేవారు రచనల ద్వారా.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కోడవల్లి గ్రామంలో 13-2-1930న జన్మించి బి.ఎ.వరకు చదువుకున్నారు. అడవి బాపిరాజు, నండూరి రామకృష్ణమాచార్యల శిష్యుడు. వాణిశ్రీ కాకముందు తన అసలు పేరు (రత్నకుమారి)తో చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో టైటిల్‌ రోల్‌ పోషించి పేరు తెచ్చుకుంది.
స్వీయ దర్శకత్వంలో గరికపాటి రాజారావు 'పుట్టిల్లు' నిర్మిస్తున్నప్పుడు మద్రాసుతో పరిచయం పెంచుకున్నారు. అయితే ఘోస్ట్‌ రైటర్‌గా కొనసాగారు. 'పసివాడి పగ' చిత్రంతో 1972లో పాటల రచయిత అయ్యారు 'సీసామీద చెయ్యి....' పాటను రాసి. 'చిల్లరకొట్టు చిట్టెమ్మ, కుడి ఎడమైతే, మంగళ తోరణాలు, ప్రెసిడెంట్‌ పేరమ్మ' తదితర చిత్రాలకు కథ, మాటలు రాసారు దాసం గోపాలకృష్ణ.
'చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, పసుపు పారాణి, తిరుపతి, కళ్యాణి, ప్రణయగీతం, రావణుడే రాముడైతే, దేవదాసు మళ్లిd పుట్టాడు' వంటి చిత్రాల్లో సుమారు 80 పాటలు రాసారు. అయినా చాలా పాటలు పేరు తెచ్చాయి.
'సూడు పిన్నమ్మా పాడు పిల్లడూ... సువ్వీ కస్తూరి రంగా... సువ్వీ కావేటరంగ... ఏంటబ్బాయా చీటికి మాటికి...' పాటలు 'చిల్లరకొట్టు చిట్టెమ్మ'లోనూ, 'గుబులు పుట్టిసావు, ఓ. మల్లికా,... నవరాగానికి నడకలు వచ్చెనే..., పాటలు కళ్యాణి చిత్రంలోనూ, ఆ ముద్దబంతులు..., రేవులోని చిరుగాలి..., పసుపు పారాణిలోను, పాలకొల్లు సంతలోన..., మాపల్లె వాడలకు... చందమామ వచ్చిందమ్మా...., జోరుమీదున్నావు తుమ్మెదా... అమ్మా మావాడు... పాటలు శివరంజని లోనూ, ఉప్పు చేప పప్పుచారు..., ఉస్కో ఉస్కో పిల్లా... పాటలు రావణుడే రాముడైతే' దేశం పన్నెండు సార్లు నారాయణమ్మ... తిరుపతి చిత్రంలోనూ ఆయన రాసిన పాటలు పాప్యులర్‌ అయ్యాయి. 1993లో మృతి చెందారు.

మా ఊరి మహర్షి సెన్సార్ కట్స్

షణ్ముఖ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో లిఖిత మూవీ మేకర్స్‌ నిర్మించిన 'మా ఊరి మహర్షి'లో విశ్వ, సోనూచంద్రపాల్‌, పృథ్వీరాజ్‌, రాళ్లపల్లి, విజయచందర్‌, సుమన్‌శెట్టి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' 18-4-2011న 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. లిక్కర్‌ బాటిల్స్‌, వాటి లేబుల్స్‌తో ఉన్న దృశ్యాలను చిత్రంలో ఎక్కడ వున్నా తొలగించమన్నారు.
2. మూడు, నాలుగు రీళ్ళలో 'చాప మీద ఎక్కి...' పాటలో చిన్ని దుస్తులతో కనిపిస్తూ అశ్లిdలంగా తొడలను చూపే దృశ్యాలను తొలగించమన్నారు.
3852.73 మీటర్ల నిడివిగల ఈ చిత్రం 3-2-12న విడుదలైంది.

ఋషి సెన్సార్ కట్స్

ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన రమేష్‌ ప్రసాద్‌ నిర్మించిన 'ఋషి'కి దర్శకుడు రాజ్‌ ముదిరాజ్‌. అరవింద్‌కృష్ణ, సుప్రియ శైలజ, మాస్టర్‌ గౌరవ్‌, సురేష్‌, రంగనాథ్‌ ముఖ్యపాత్రధారులు. ఏ విధమైన కట్స్‌ లేకుండా 30-12-2011న 'ఎ' సర్టిఫికెట్‌ని 'ఇసి' జారీ చేయగా 10-2-2012న విడుదలైంది.

రామదండు సెన్సార్ కట్స్

నవ్య చిత్రాలయా క్రియేషన్స్‌ నిర్మించిన చిత్రం 'రామదండు'. రాధికా నారాయణరావు, బండి రత్నకుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సతీష్‌ వేగేశ్న కృష్ణుడు, కళ్యాణి, ఝాన్సీ, ఎం.ఎస్‌.నారాయణ ముఖ్యపాత్రధారులు.
'రామదండు'ని చూసిన 'ఇసి' 5 కట్స్‌తో 23-12-2011న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
ఒకటి రెండు రీళ్లలో:
1. ''హెడ్మాస్టర్‌ కూతుళ్లకు పెళ్లి అవదా, మొగుళ్లు రారా'' డైలాగ్‌ తొలగించారు.
2. పిల్లలను బెత్తంతో హెడ్మాస్టర్‌ కొట్టే దృశ్యాలు కత్తెర పాలయ్యాయి.
అయిదు ఆరు రీళ్ళలో:
3. ''ఆడదంటే అయస్కాంతం లాంటిది...'' నుంచి ''.... తగులుకునేది ఇనుపముక్క'' వరకు గల డైలాగ్‌ని కత్తెరించారు.
4. ఐటమ్‌ డ్యాన్స్‌లో ఎర్రటి బ్లౌజ్‌ వేసిన ఐటమ్‌గాళ్‌ క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌ దృశ్యాలను తొలగించారు.
5. తొమ్మిది పది రీళ్ళలో '' నిచ్చెన నీ కంటే బరువుంది'' అని కొండవలస అనే డైలాగ్‌ కత్తెర పాలయింది.
3685.37 మీటర్ల నిడివిగల 'రామదండు' 3-2-12న విడుదలైంది.

నవ భావనల నయాగరాయాచేంద్ర గేయధార!!

  • వండి, వార్చిన అమ్మ స్వయంగా వేడివేడిగా వడ్డించినట్లు...
  • కలమాగిన ఫలాన్ని కోసిన ఫలాన్ని కోసి కొమ్మమీద కూర్చుని తినేటట్లు...
  • తుట్టిలోని తేనెను చెట్టుమీద కూర్చొని జుర్రుకున్నట్లు...
  • అరవిరిసిన మల్లెల మధుర వాసనల్ని తోటలోనే మూర్కొన్నట్లు....
  • సంగీతం, సాహిత్యం, గానం మూడు కళల మేళవింపుగా పుట్టినది గేయధార...
  • నవతను ఆకర్షించే సంగీత ప్రక్రియలో మేటి యాచేంద్ర ...
  • సంగీతంలో గురు ముఖత్వవీ నేర్చుకోకపోయినా తమ సంస్థానంలో శాస్త్రీయ, హిందూస్తానీ, కర్ణాటక సంగీత కచేరీలను వినడం ద్వారా సంగీతాన్ని తనలో జీర్ణించు కుని... తరతరాలుగా తమ కుటుంబీకులలో వస్తున్న సాహిత్య ప్రవీణతని రంగరించుకుని గేయధార ప్రక్రియ కు సృష్టికర్తగా నిలచారు. దిగజారి పోతున్న సంగీత, సాహిత్యాల స్థాయిని నిలబెట్టాలని భావించి.. గేయ కవిత్వంలో సాహితీ ప్రపంచంలో తన కంటూ సము న్నత స్థానం దక్కించుకుని..ఓ నూతన ఒరవడి సృష్ఠిం చాలని, అది సామాన్య జనాళికి అందుబాటులో ఉండా లనే పరవెూద్దేశ్యంతో ప్రారంభించిన వినూత్న సాహితీ ప్రక్రియే సంగీత గేయధార అని చెప్తారు యాచేంద్ర.
    సంగీత, సాహిత్య, నృత్య కళలకు పుట్టినిల్లు అయిన వేంకటగిరి సంస్థానంలో 1952 జనవరి 21న జన్మించిన యాచేంద్ర సాయిక్రిష్ణ యాచేంద్ర బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై మక్కువ ఎక్కువ... ఆ క్రమంలోనే ఆయన మద్రాసు విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. పట్టాను మహాభారతం లో శ్రీకృష్ణుని పాత్ర అనే అంశంపై పరిశోధనలు గావించి తెలుగులో డాక్టరేట్‌ పట్టా పొందారు. సాహిత్యంలో, సంగీతంలో గురువుల వద్ద ఎటువంటి విద్య నభ్యసించని ఆయన సంగీత విద్వాం సులు గాన కచేరీలు అలరించి, సంగీత పరిజ్ఞానాన్ని సంపాదించి పాటలకు, గీతాలకు బాణీ కూర్చాలన్న విధానాన్ని నేర్చుకుని... తన రచనా కాంక్షకు సంగీతాన్ని జోడించి సాహితీరంగంలో సరికొత్త ఒరవడిని ప్రవేశ పెట్ట్టాలని... భావించారు.
    అప్పటికే కొన్ని వందల పాటలు వ్రాసి ప్రసిద్ధ గాయనీ, గాయకుల చేత పాడించిన అను భవంతో... 20సంవత్సరాలు ప్రసిద్ధ సినీ సంగీ త దర్శకులతో చేసిన సహచర్యం కలసి వచ్చి విశేష ప్రాచుర్యమైన సంగీత గేయధారకు రూపకల్పన చేసారాయన...ఎంతమందితో పని చేసినా కూడా రచనలో డా్ప్పసి.నారాయణ రెడ్డి, గానంలో సుశీల, స్వరకల్పనలో డా్ప్పరాజేశ్వరరావులు గురుతుల్యురని వినమ్రతతో చెప్తారు యాచేంద్ర.
    బోలెడు పాటలు
    ఆణిముత్యాల్లాంటి అనేక భక్తి పాటలను... జనం పాడుకునే సాధారణ పదాలతో జానపదాలను రాసిన యాచేంద్ర, వాటికి స్వరరచన కూడా సమకూర్చి పి.సుశీల, ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, ఎస్‌. జానకి, వి.వి. రామకృష్ణ సుప్రసిద్ద సినీగాయకుల నేతృత్వంలో పాడించగా...ఆ పాటలకు విశేష స్పం దన లభించింది. నేటికీ ఆ పాటలు శ్రోతలను వీనుల విందు చేస్త్తున్నాయంటే... వాటికి లభించిన ప్రచారం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇవేేగాక మరో వందకు పైగా పాటలను, గీతాలను దూరదర్శ న్‌, ఆలిండియా రేడియోలలో ప్రసారంకాబడ్డాయి. ఈయన రాసిిన అనేక గీతాలలో గీతారాధన అనే పుస్తకం కూడా ముద్రితమై ప్రాచుర్యం పొందింది.
    శాసనసభ్యుడిగా సేవలు...
    1985-89 మధ్య కాలంలో వెంకటగిరి నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా గెలుపొంది రాజకీయాలలో ప్రవేశించిన ఆయన తెలుగుదేశం పార్టీలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాలలో ఎంత బిజిగా ఉన్నా తన గేయ ధారని విడువకుండా అనేక కార్యక్రమాల ద్వారా దానిని జనం చెంత కు చేర్చేందుకు కృషి చేసారు. సర్వజనావళికి సంగీత, సాహిత్యాలు అందుబాటులో వుండాలనే సదుద్దేశ్యంతో గేయధార ప్రక్రియని హైదరాబాద్‌, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, తెనాలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, కడప, రైల్వేకోడూరు తదితర ప్రాంతాలలో వందల ప్రదర్శనలు యిచ్చి ప్రాచుర్యాన్ని పొందారు.
    ప్రదర్శన యిచ్చిన చోట సత్కారాలు అందుకొనుటే కాక, లలిత కవిశేఖరులు, పుంభావ సరస్వతి వంటి బిరుదు సత్కారాలు పొందిన యాచేంద్ర తన గేయధారకు అంతం అంటూ లేదని, ఊపిరి ఉన్నంత వరకు గేయధార ప్రదర్శనలు యిస్తానని చెప్పారు. తాను రాజకీయాలలో ఉన్నా పదవులు అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధి్థనేత స్వర్గీయ యన్‌.టి.ఆర్‌. రాజకీయ గురువు అని, పదవులు ఆశించకుండా ప్రజాసేవ, డబ్బుతో సంబంధం లేకుండా ఖర్చులు భరిస్తే వెళ్లి గేయ ధార కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. పదవులు ఆశించని ప్రజాసేవ, కాసులు కాంక్షించని కళా సేవ తన జీవిత పరమార్ధమని డా్ప్పవెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ప్రకటించారు.

    ప్రక్రియ సాగేదిలా...
    గేయధార అష్ఠావధానంగా కాదని ఆతరహాలో సాహిత్యానికి సంగీతం మేళవించి సాగే ప్రక్రియని అన్నారు. ఇందులో వస్తు నిర్దేశం, ఇష్ఠపద ప్రయోగం, పదనిషేదం, రాగ, తాళనిర్దేశం, మంచి ముచ్చట్లు. ఇలా ప్రధా నంగా ఐదు అంశాలుంటాయని, వస్తు నిర్ధేశం చేసే వారు చెప్పిన అంశా న్ని పూరిస్తున్న సందర్భంలో మంచి ముచ్చట్లతో యాచేంద్రకు క్షణ క్షణం అడ్డు తగులు తుంటారు. ఈ ముచ్చట్లుకు తృప్తికర సమాధానాలు యిస్తూ సాహిత్యంతో పాటు మరొకరు నిర్ధేశించిన రాగ, తాళాలతో సాహిత్యాన్ని సంగీతపరంగా పూరిస్తారు. తిరుపతిలో నిర్వహించిన గేయధారలో రెండవ దైన ఇష్టపద ప్రయోగంలో పులుపు, కారం చేదు, వగరు అనే పదాలతో తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులను వర్ణించమని ప్రొఫెసర్‌ వాణి కోరగా యాచేంద్ర తన సాహిత్యంలో వేంకటేశుని వింత రుచులాడు ఇది మేను సిరగలాడు అతడేను అంటూ ప్రారంభించి ఃవలఃపులుపులకరించగా మమఃకారమేః మధురించగా... అంటూ శబ్దాల్ని విరచి అర్థాల్ని సమన్వయ పరచిన తీరు సాయికృష్ణ సాహితీ ప్రజ్ఞ చాటి చెప్పారు. ఈ గీతాన్ని వెూహనరాగం, ఆది తాళంలో సవ్మెూహన రీతిలో ఆల పించిన ఆయన మరొకచోట వంకాయ, టెంకాయ, పిల్ల కాయ, మొట్టికాయ అనే పదాలు ప్రయోగించి ఓ గీతాన్ని కాదంబర రాగం, రూపక తాళంలో ఆలపించమని కోరగా యాచేంద్ర తన సాహిత్యానికి, సంగీతాన్ని జోడిస్తూ
    వంకాయవంటి కూరయూ
    పంకజము వంటి భార్యయూ
    నీకుంటే అదే లోకము
    లేకుంటే భలే శోకం...
    అంటూ జానపద ఊపులో జజ్జనకరి దరువులాంటి పాట అందుకుని కవ్వించే, నవ్వించే కన్నెపిల్ల ఃకాయదాః వెన్నెల ఆ కన్నులోన అంటూ పదాన్ని విరిచి తన ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
    ప్రముఖుల ప్రశంసలు...
    ఒక పద నిషేద అంశంలో సహస్రావధాని డా్ప్పమేడసాని వెూహన్‌ వస్తునిర్ధేశం చేస్తూ కలహ నారదుడు, గీతికా విశారదుడు, కాంతి విజితా పారదుడు అయిన నారదుడు అన్నయ్య తుంబురు డు ఈ గేయధారను చూచి మిమ్ములను ఆశీర్వదించినట్లు, వర్ణించమని ఇందులో ఆరుదెంచె.. దీవించు పదాలు నిషేదం అని మేడసాని అనగా సాయికృష్ణ పులకించి పదాల నిషేదం ఎదు రైనా బెదరకుండా సమయస్ఫూర్తితో, సందర్భానుసారం మరింత సూటి పదాలతో పూరించి శభాషనిపించుకున్నారు.
    ప్రదర్శనలు...
    1995 ఏప్రిల్‌ 5న తేదీన కడప జిల్లారైల్వే కోడూరులో 100వ ప్రదర్శనలో తమ గురువైన డా్ప్పయస్‌. రాజేశ్వరరావు, పి.సుశీల ఆధ్వర్యంలో నిర్వహించిన గేయధార మరపురాదని..ఇదే విధంగా 1996 డిసెంబర్‌ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినా తిరుమల శ్రీవారి ఆస్థాన మండపంలో ప్రదర్శన లు యిచ్చానని చెప్పారు. ఇప్పటి వరకు ఇలా పలు చోట్ల ఎన్నో సంగీత గేయధార కార్య క్రమాలను నిర్వహించి అనేక మంది శ్రోతలను ఆకట్టుకుంటున్న సాయికృష్ణ ఈ ప్రక్రియని పలువురికి పంచేం దుకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియని నేర్పించేం దుకు శిష్యగణాన్ని సిద్దం చేసారు.
     

అమ్మా నాన్నలకీ..పరీక్షా సమయం..

అప్పుడే పరీక్షల కాలం మొదలైంది....
పిల్లలకే కాదు... వారి తల్లిదండ్రులకీ ఇవి పెద్ద పరీక్షలే...
పిల్లలు మంచి మంచి మార్కులు సాధించే దిశగా....
ఏం చదువుతున్నారో... అర్థం కాక... తలలు పట్టుకునే.. అమ్మానాన్నలు...
ర్యాంకులు, గ్రేడ్‌లు కాస్త పక్కకు నెట్టి సానుకూల దృక్పధంతో ఆలోచించి...
పిల్లల్ని పరీక్షలకు సమాయుత్తం చేయగలిగితే..
విజయాన్ని ఇట్టే సొంతం చేసుకుని గర్వంగా నిలబడతారు పిల్లలు.
పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నతంగా వారిని చూడాలను కోవటం తల్లిదండ్రులు గా మీ బాధ్యత దానిని కాదనలేం. కానీ పరీక్షల మాటు న వారిని తీవ్ర వత్తిళ్లకి గురి చేయటం వల్ల చదువు, మార్కులు సంగతి విషయం పక్కకు జరిగి, మిమ్మల్ని చూస్తేనే భయపడే పరిస్థితికి చేరుకుంటారు పిల్లలు. ఓ వైపు బుజ్జగిస్తునే... లాలిసూ.్త.. పిల్లల్ని పరీక్షలకు తయారు చేయాల్సిన ఆవశ్యకతని గుర్తించాలి కానీ పిల్లల్ని పరీక్షలకి పంపడమంటే ఓ యుద్ధానికి పంపు తున్నామనుకునేలా...మనమే ఓ పెద్ద అగ్ని పరీక్షని ఎదుర్కొన్నట్లు ప్రవర్తిస్తే... చిన్నారి హృదయా లపై తీవ్ర ప్రభావం చూపి లేనిపోని రుగ్మతల బారిన పడటం ఖాయం అని తల్లి దండ్రులూ గుర్తించండి...
వేసవి వచ్చిందంటే చాలు... ఎండలకి ఎంత భయపడతామో ... పిల్లలున్న తల్లిదండ్రులు వారి పరీక్షల విషయంలో అంతకు రెట్టింపు భయపడతారన్నది వాస్తవం. పరీక్షలు దగ్గర పడుతున్న కొలది... పిల్లలకన్నా వారి అమ్మా నాన్నలకే టెన్షన్‌ ఎక్కువ. పరీక్షల సమయం సమీపిస్తున్న కాలంలో పిల్లలు ఏ చిన్న పొరపాటు చేసిన దాని బూతద్దంలో చూసి తాము బెంబేలెత్తిపోతూ పిల్లల్నీ బెదర గొట్టేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బ దీసే అవకాశాలుంటాయని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లలకి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ సమీపిస్తున్న సమయంలో వారు పరీక్షలకు ఎలా సమాయుత్తం అవుతున్నారో... తెలుసుకోవాల్సిం దే... కాదనం... కానీ .. వారిని బెదర గొట్టే విదంగా ప్రవర్తిస్తే... ఫలితం నిండు సున్నాగా మారి మొదటికే మోసం రావచ్చు జాగ్రత్త.
తల్లిదండ్రుల బాధ్యతలు :
- చిన్నారులు, పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విధానంపై ఓ కన్నేసి ఉంచండి.
- ఏడాది పొడుగునా చదివిన సబ్జక్టులే అయినా... ఒక్కోసారి పిల్లలు వాటిని మరచిపోవటమో, పున:శ్చ రణ చేసినా... దానిపై పట్టు సాధించలేకపోవటమో జర గొచ్చు. ఆసమయంలో వారు కలత చెందుతూ కనిపి స్తారు. అలాంటప్పుడు వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఏఏ సబ్జక్టులలో ఏఏ పాఠాలపై సందేహాలున్నాయో, తెలుసుకోండి. వీలైతే పాఠశాలకి వెళ్లి... వారి తరగతి ఉపాధ్యాయుల్ని కల్సి... పిల్లల కున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు చొరవ తీసుకోండి. దీని వల్ల వారి సమస్య తొందరగా పరిష్కరించగలగటమే కాక.. వారిలో వేల టన్నుల ఆత్మ విశ్వా సాన్ని నింపిన వారవుతారు.
ఆహారంలో జాగ్రత్తలు...
చిన్నారుల్లో పరీక్షల సమయంలో చదువుపై శ్రద్ద తగ్గి తీవ్ర చిరాకు, కోపం, అసహ నాలని ప్రదర్శిస్తుం టారు. ఇందుకు కారణం వారికి సరైన ఆహారం అందక పోవటమే..
పరీక్షలంటూ వేళ పట్టున సరైన తిండి లేకుండా చదువు పేరుతో పుస్తకాలు ముందు వేసుకుని కుస్తీలు పడితే నీరసం, ఆపై నిద్ర మినహా మరింకేం రావని పిల్లలకి నచ్చ చెప్పండి.
వీలైనంత వరకు వారు సమ యానుకూలంగా ఆహారాన్ని పరిమి తంగానైనా పలుదఫాలుగా తీసుకునే లా చూడండి... ఆయిల్‌ ఫుడ్స్‌ స్థానంలో పళ్లరసాలు, పచ్చికూరలు, పచ్చిగింజలు, ఇవ్వండి... కొత్త శక్తితో పాఠాలు చదవటం, చదివింది గుర్తుంచుకోవటానికి ఉప యోగ పడుతుంది.
పరీక్షల సమయంలో వీలైనంత వరకు మసాలా వంటలు, బిర్యానీలు, ఫ్రైలు పెట్టడం పూర్తిగా ఆపేయండి... మీరు పనొ తొందరగా అవుతుందని అనుకుంటే వీటివల్ల పిల్లల్లో కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. నిద్రా సమయం తక్కువ కావటం వల్ల దానికి మసాలాలు తోడైతే... అవి ఒకింత ఆరగక అజీర్ణం, కడుపులో మంట, తీవ్ర దాహం, నరాల బలహీనత, వాంతులు, కడుపు నొప్పి, కళ్లుతిరగటం తదితరాల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఒక్కోసారి ఏకాగ్రత దెెబ్బతినడమే కాకుండా జ్ఞాపక శక్తిపైనా ప్రభావం చూపి తలనొప్పికి, మైగ్రేన్‌కి దారి తీసి తీస్తుంది. దీని వల్ల చదవాలన్న ఆశక్తికూడా పోతుంది కనుక పరీక్షల సమంలో పిల్లల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి.
ఆడుకోనివ్వండి...
పిల్లల్ని చదివించే ప్రయత్నం లో నిత్యం గదుల్లో బంధించేసి పరీక్షలంటే ఏ యుద్ధానికో పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు చేసే హడావిడి మాను కొంటే.. మంచిది.
అనునిత్యం చదువే కాకుండా పిల్లల్ని కాసేపు ఆడుకోనివ్వండి. దాని వల్ల రాత్రుళ్లు నిద్రలేమితో కళ్లపై పడే బాధ నుండి ఉపశమనం లభించడంతో పాటు మనసుని ఉల్లాసంగా ఉంచే దివ్యౌషదం దొరి కిన అనుభూతి పొందుతారు. దాని వల్ల మూడ్‌ చెడి పోవటానకి స్వస్తి పలకడమే కాక డిప్రషన్‌కి లోను కావటం తదితరాలను వీడి చదువుపై శ్రద్ధ చూపి స్తారు.
ప్రోత్సహించండి...
పిల్లలు పరీక్షల సమయంలో చదివేప్పుడు రివిజన్‌లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అది మీ దృష్టికి రాగానే దిద్దే ప్రయత్నం చేయండి. తప్పులన్నా అలా రాయకూడదని... ఎలా రాయాలో సున్నితంగా చెప్పండి... బాగా రాసారనుకుంటే మరింత ఉత్సాహపరిచే మాటలు చెప్తూ... వెన్ను దట్టండి. దీని వల్ల వారు చేసే తప్పులు తెలుసుకోవటమే కాకుండా వాటిని పరీక్షలలో పునరావృతం అవ్వకుండా జాగ్రత్త పడి మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తారు. పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చా యో జాగ్రత్త అంటూ ముందునుండే ఒత్తిడి తెస్తే చివరకి ఫలితాలపై ఆ ప్రభావం పడుతుంది.
కొందరైతే పరీక్షలనగానే పిల్లల్ని అర్థరాత్రుళ్ల వరకు చదివించేసి... సరి గ్గా వారికి కావాల్సిన నిద్రాసమయం పూర్తి కాకముందే ఉదయం ఏ నాలు గు గంటలకో అలారాలు పెట్టి మరీ లేపేసి చదవమంటూ హూంకరి స్తుం టారు. ఇలా చేయటం వల్ల చదవ టం మాట అటుంచి నిద్ర సమయం తక్కువై.. ఆనారోగ్యానికి గురై... చివరకి పరీక్షా కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని చూసే సరికి ఏం రాయాలో అర్థం కాక అక్కడే నిద్రపొయే విద్యా ర్థులూ ఉన్నారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోండి.
ఇలా చదివించండి...
పరీక్షల్లో చదవమని పిల్ల్లల్ని ప్రోత్సహించమన్నారు కదా అని పదేపదే చదువంటూ వారిని ఉరుకులూ పరుగులు పెట్టించి కట్టడి చేసే ప్రయత్నాలకు స్వస్తి పలకండి.
పరీక్షల సమయంలో పిల్లల్ని ఏ ట్యూషన్‌ టీచర్‌ కో అప్ప గించడమో... కంబైండ్‌ స్టడీ అంటూ స్కూల్లో ఎగస్ట్రా క్లాస్‌లో చదు వుతున్నారనో పట్టించుకోకుంటే ఇబ్బందులు పడేది మీరే... కనుక పిల్లలేం చదువుతున్నారో పట్టించుకోవటమే కాకుండా... వారిని ప్రోత్సహించేలా లాలనగా చెప్తూ... ఏం చదివారో ప్రశ్నిస్తే... ఇట్టే జవాబిస్తారు. తొలి నుండి చదవంది ఇప్పుడు చదివేస్తే వచ్చిస్తుం దా? లాంటి నిరుత్సాహకరమైన మాటలు మాట్ల్లాడకండి... అది మరీ ఇబ్బందికరం. పరీక్షలకు తగ్గట్టు పోర్షన్‌ వారీగా చదివించడం మంచిది. సమయానుకూలంగా ఎంత చదవగలిగితే అంత చదివమని చెప్పండి... ప్రతి సెక్షన్‌లో అవసరమైన వాటిని చదివేం దుకే అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పండి. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే ప్రతి సబ్జెక్టుని పూర్తి చేసుకునే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా... నువ్వు చదవాల్సిందే... వందకు వందా రావా ల్సిందే... అంటూ బెదర గొడుతూపోతే పరీక్షపై కన్నా మీ మాటల వల్ల మీపై వ్యతిరేక భావం పెరిగిపోతుంది జాగ్రత్త...

వేసవిలో వెన్నెలలా...లే కొబ్బరి నీళ్లు

నులు వెచ్చని కొబ్బరి నీళ్లు... వేసవిలో హాయి గొలిపే... అద్భుత ప్రకృతి వరం...
కాసింత ఉప్పగా... కాసింత తీయగా... మరి కాసింత వగరుగా ... అంతకు మించి గొప్పగా...
అరుదైన రుచిలో ఉంటూ... రసాయనపు పానీయలందించలేని...
శ్రేష్టమైన పోషకాలనందిస్తూ... చిన్నారుల నుండి పండు ముదుసళ్ల వరకు ఆరోగ్యాన్ని...
అనేక మందికి ఉపాధిని చూపిస్తున్నాయి కొబ్బరి బొండాలు....
మార్చి నెల పూర్తిగా పూర్తవ్వక ముందే... ఇపðడిపðడే...శీతాకాలపు మంచు తెరలు చీల్చుకుని బైటకొస్తున్న భానుడు తన గ్రీష్మ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతు న్నాడు...దాన్నిధీటుగా తట్టుకునేందుకు.. గ్రీష్మానికి విరుగుడు పళ్లతోనే చెప్పాలనే ేవెూ... ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతవరం కొబ్బరి. ఎంతటి వేసవి తాపాన్నయి నా ఇట్టే తీసి పారేయగల సత్తా ఉన్నది కొబ్బరికే... రంగునీళ్ల పానీయాలందివ్వలేని ఎన్నో ఆరోగ్యాన్నందించే ఆద్భుత రసాయనాల కలయిక లేత కొబ్బరి నీళ్ల సొంతం అనడంలో సందేహం లేదు.
వేసవి ఎండలు ముదురుతున్నాయి... దీని నుండి మనల్ని రక్షించుకునేందుకు.. అనేక ఉపశమనాల ద్వారా సేద తీరేందుకు ఎన్నో రకాల పానీయాల మీద ఆధారపడుతుంటాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కూల్‌ డ్రింకుల షాపులు, జ్యూస్‌ సెంటర్లకు ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. కూల్‌ డ్రింక కంపెనీలైతే... పనిలో పనిగా రేట్లని పెంచేసే పనిలో ఉంటే... ధియేటర్లు... షాపింగ్‌ మాల్స్‌లతో పాటు అన ేక చోట్ల ఇష్టానుసారం బాటిళ్లపై ఉన్న ధరలకన్నా అధి కంగా వసూలు చేస్తున్నా... దాహార్తితో కిమ్మనకుండా చెల్లించి తప్పనిసరి పరిస్ధితులో సేద తీరేందుకు వాడు కుంటున్నాడు...
మరి ఇలా రసాయనాలతో తయారు చేసిన చల్లని పానీయాలు తాగటం వల్ల సుఖమేమైనా ఉందా అంటే లేదనె చెప్పాలి. పైగా లేని రోగాలను కొత్తగా మనలో ఇముడ్చుకుని ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అంత కన్నా ప్రకృతి సహజ సిద్దంగా అందించిన చల్లని పానీ యాలలో ఒకటైన లే కొబ్బరి నీళ్లని తీసుకుంటే ఆరోగ్యంకి ఎలాంటి ఢోకా లేదన్నది అనేక పరిశోధనల్లో తేలిన వాస్తవం.
వేసవితాపం తీర్చేది...
ప్రపంచంలో తయారవుతున్న ఏ పానీయం కూడా కొబ్బరి నీళ్లకు సాటి రానే రావు. శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లు, ఖనిజాలని అందించే ఎలాంటి కల్తీలేని ప్రకృతి సహజ సిద్దమైన నీళ్లని అందించేది కొబ్బరే.
వేసవిలో మన శరీరంలోని నీటి శాతాన్ని తగ్గుము ఖం పడుతూ ఉంటుంది. దీని వల్ల ఎలక్రోటైల్‌లు తగ్గి నీరసం, ఆయాసం, తదితర లక్షణాలతో పాటు ఇతరా లు వస్తాయి. వీటి నుండి తక్షణ ఉపశమనం పొందా లంటే తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్లనే... వీటిలో మన రక్తంలో ఉన్న ఎలక్ట్రోలైట్‌లకి సమతూల్యంగా ఉంటూ.. మన శరీరానికి లెక్కలేని ప్రయోజనాలందించే అనేక రసాయ నాలు కొబ్బనీళ్లు తక్షణం అందించి వెంటనే కోలుకునేలా చేస్తాయి. దైనందిత జీవితంలో కొబ్బరి నీళ్లని తాగటం అలవాటు చేసుకుంటే ... ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని...పైగా...పౌష్టికాహారం తక్కు వగా ఉన్నా... తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నా... శరీ రంలో సహజ లవణాన్ని కోల్పోయినపðడు కలిగే అలసట నుంచి కొబ్బరినీరు కాపాడుతుంది. డయేరియా తో ఇబ్బందిపడే పిల్లలకు డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడే పానీయం ఇదన్నది అక్షర సత్యం...
బోలెడు
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఏరేటెడ్‌ పానీయాలు, ప్యాకేజ్డ్‌ పళ్లరసాలు తాగడం దాదాపు అందరూ తాగుతుంటారు. వీటి వల్ల పెద్దగా ఉపయో గం ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరిని వాడి తే.. ఆరోగ్యానికి మంచిది. కృత్రిమ పానీయాలు పిల్లల కు మేలు చెయ్యవు కనుక. కొబ్బరినీరే వారికి సురక్షిత పానీయంగా భావిస్తారంతా,,, ఇది సహజంగా నే తొంద రగా... స్ట్టెరైల్‌ అవుతుంది ప్రయాణాల్లో సైతం పిల్లలకు సాదా నీటి కంటే మంచి పానీయం. దాని వల్ల నీరు కలుషితం అయిపోయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చింతే మీకు ఉండదు.
ఇక గర్భవతులలో ఎక్కువ మంది మలబద్ధకం, జీర్ణకోశంలో తేడాలు, గుండెలో మంట సాధారణ సమస్యలతో బాధ పడుతుంటారు. అందునా వేసవి కాలంలో ఈ బాధలు మరీ అది ్థకంగా ఉంటా యి. వీటిని అధిగ మించాలంటే కొబ్బరి నీరు తాగట మే తప్పనిసరి చేసుకోవటమే మంచి ది. కనుక గర్భవతు లు, పాలిచ్చే తల్లులు కూడా వీలచి క్కినపð డల్లా కొబ్బరి నీరు తాగుతుండాలి.
ఇక పాపాయి ఆరోగ్యానికి సైతం కొబ్బరి నీరు చాలా సహకరిస్తుంది. పాలిచ్చే తల్లులు కొబ్బరి నీరు తాగితే పాలలో కన్నా మించిన అనేక పోషకాలు అంద టమే కాక తల్లిపాలలో లారిక యాసిడ్‌ను పెంచు తాయి కనుక దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలుం టాయి కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్‌ఫెక్షన్ల నుండి పరిరక్షిస్తాయి. పైగా ఈ నీటి వల్ల వృక్షసంబం ధిత హార్మోన్లు. సైటోనిన్స్‌. సహజసిద్ధమైన సైటోనిన్స్‌ డయటరీకి అభించడం వల్ల. ఎదుగుదల, అభివృద్ధి, వార్ధక్యాల్ని క్రమబద్ధీకరించడంలో ఉపకరించే హార్మోన్ల సైటోకినిన్స్‌ చాలా ఎక్కువగా లభిస్తాయి. కొబ్బరి నీరు వంటి వాటిద్వారా సైటోకినిన్స్‌ తీసుకునేవారికి శరీరం పై వార్ధక్య లక్షణాల వ్యతిరేక ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుం దని పరిశోధకులు తెలియచేస్తున్నారు. వయస్సురీత్యా వచ్చే రుగ్మతలను నివారించగలదు.
లేత కొబ్బరినీటి ప్రభావం జీర్ణవ్యవస్ధపై ఉండదు కాబట్టి నెలల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ కొద్దిగా రిప్రెషింగ్‌ టానికలాే ఇవ్వవచ్చు. అలాగే ఎథ్లెట్లు, క్రీడా కారులు రోజూ ఓ గ్లాసు కొబ్బరి నీరు తాగుతుంటే శరీ రానికి తక్షణ పోషకాలు అంది శక్తి కలుగుతుంది.
గుండెజబ్బులు, స్ట్రోకలేకు అధిక రక్తపోటు ప్రధాన కారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో ఇతోధికంగా సహకరిస్తాయి. ఈరెండుఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివా రించి, రక్తసరఫరాను మెరుగుచేయడంలో సహక రిస్తుంది.అలాగే గుండెజబ్బులుగలవారికి హార్ట్‌ఫెయి ల్యూర్‌ రిస్కును కొబ్బరి నీరు తగ్గించగలదని పరిశోద ్థ్థకులు తెలియచేస్తున్నాయి.
కొబ్బరి నీరు మూత్ర, జననాంగ వ్యవస్ధలపై థెరప టిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోశ ఇన్‌ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్ల తగ్గించడంలో, శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతానో సహకరిస్తుంది. కిడ్నీలో
రాళ్లు కరిగిపోవడా నికి కొబ్బరి నీరు మంచి ఫలితం ఇస్తుంది.
ఉష్ణప్రదేశాల్లో పాటు వేసవి కాలంలో డీహైడ్రేషన్‌, సన్‌స్ట్రోకలుే లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి, దీనికి సాదానీరు, పండ్లరసాలు తీసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు... కొబ్బరి నీరు ప్రభావవంతంగా పని చేసి చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆక కొబ్బరి నీరు కలరా, విరేచనాలు, ఇన ్‌ప్లూయెంజా చికిత్సల్లో వినియోగిస్తున్నారు. అలానే డీ హైడ్రేషన్‌కు దారితీయగల ఇన్‌ఫెక్షన్‌ సంబంధిత రుగ్మతల చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. ఎందరినో ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలను కాపాడగల తిరుగులేని పానీయం కొబ్బరి నీరన్నది వాస్తవం...
గిట్టుబాటు కావట్లే...
మండుతున్న ఎండల్లో రోడ్ల ప్రక్కన కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవారు... చాలా మంది దర్శన మిస్తున్నారు. కొబ్బరి బొండాలు తమకి ఉపాధి చూపిస్తున్నందుకు ఆనందించాలో... ఆశించిన ఫలితం రాక పోవటం పట్ల విచారించాలో అర్ధంకాని స్థితి నెలకొందని...పోతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో 10 నుండి 12 రూపాయలు చేసే బొండా ప్రస్తుతం 15 రూపాయల వరకు ధర పలుకుతోందని... కానీ రోజు రోజుకీ హౌల్‌ సేల్‌ వ్యాపారులు... రవాణా ఛార్జీలు పెరుగుతున్నందున ధర పెంచుతుండటంతో వినియోగ దారులకు అందుబాటు ధరలో అందించలేక పోతున్నా మని... పైగా ఒక్కోసారి నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తోందన్నది వారి ఆవేదన. చాలా మంది బొండం ధర విని బెంబేలెత్తి పోయి కూల్‌ డ్రింకులు తాగేందుకు మక్కువ చూపుతున్నారని వాపోయారు. అయినప్పటికి గతంతో పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నట్లు వారు చెప్పారు.

సేద తీర్చే... వేసవి విడుదులు



వేసవి సమీపిస్తుంటే... మరో వైపు ఎండల వేడిని తట్టుకునేందుకు
వివిధ చల్లని ప్రదేశాలు చుట్టేయాలని భావిస్తుంటారంతా...
పిల్లలకి పరీక్షలు పూర్తి కావటంతో వాటిలో భారీగా మార్కులు వచ్చేసి...
ర్యాంకుల కోసం చేసిన మొక్కుబడులు తీర్చేందుకు
ఏ తిరుపతో... కాళహస్తో... శ్రీశైలవెూ... వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి...
అటు స్వామికార్యం... ఇటు స్వకార్యం రెండు పూర్తి చేసుకుంటారు....
ప్రతి ఏడాదీ ఉండే ఆ తంతులని కాస్త పక్కన పెట్టి... మనకి దగ్గర్లోనే ఉండి...
ప్రకృతిరమణీయత నడుమ పరవశింపచేసే.. అద్భుత ప్రపంచంలో....
ఈసారి మునిగి తేలే ప్రయత్నం చేస్తే... ఆదాతో పాటు ఆహ్లాదం సొంతం కావటం ఖాయం.

వేసవి విడిది అంటే ఎక్కడో దూరాన ఉన్న ఊటీ, కొడైకెనాల్‌, గోవా ఇలా అనేక ప్రదేశాలకి వెళ్లట మేనని... అక్కడ సేద తీరితే... జన్మధన్యమై పోతుందనే వారు మనలో ఎక్కువగానే ఉంటారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా గోవాలను, కొడైకెనాల్‌లని మించిన ప్రకృతి అందాలు... మన రాష్ట్రం లోనే ఉన్నా... వాటిపైనే ఎందుకనో మక్కువ. అయితే పెరుగుతున్న ఖర్చులు... రవాణా ఛార్జిలు... ఇతరాలు కలుపుకుంటే వేసవి తాపం తీర్చుకోవటం మాట అటుంచి జేబులు చిల్లుపడి... అపð మిగిలే పరిస్థితి ఉంటుంది సామాన్య జనాలకి... అందుకే మన రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తూ.. చల్లదనాన్ని... ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తూ... పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి కే సామాన్యుడి ఊటిగా చెప్పబడే అరకు, శ్రీశైలం అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్య ఉన్న జలపాతాలు, నాగార్జునసాగర్‌ అందాలు ఇలా వీటన్నిటినీ చూసి మైమరచిపోయే టూరి స్టులకు సేవలందించేందుకు అనేక హౌటళ్లు, రిసార్ట్‌లు, గెస్టుహౌజ్‌లు సిద్దంగా ఉన్నాయి. మరెందుకాలస్యం... బయలు దేరండి...
మన రాష్ట్రంలోని వేసవి విడుదులుగా ప్రసిధ్ది కెక్కిన ప్రాంతాలు మన భారత దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ధీటుగా నిలచేవే... వేలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ... వేసవిలో ఆహ్లాదాన్ని కలిగించేవే... మన సమీపంలో ఉండే ప్రాంతాలని దర్శించడం ద్వారా మన అనవసరపు ఖర్చుని తగ్గించుకోవటమే కాకుం డా మన పర్యాటక ప్రాంతాలపై అవగాహన గలిగించుకుని ... వాటిగురించి పదిమందికీ చెప్తూ.. మన టూరి జం అభివృద్థికి బాటలు వేసే ప్రయత్నం చేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మనమూ భాగస్వామ్యం కావచ్చు. మన రాష్ట్రంలోని వివిధ వేసవి పర్యాటక ప్రాంతా లను ఓ సారి పరికిస్తే...
అనంతగిరి కొండలు
సహజ సౌందర్యాల నడుమ ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేసే ఈ అనంతగిరి కొండలు విశాఖకు దగ్గర్లో ఉన్నాయి. ప్రకృతి అందాలే కాదు... అనేక ఔషధ గుణాలున్న మెక్కలు ఈ కొండల్లో పెరుగుతుండటం వల్ల ఈ ప్రాంతం చాలా చల్లగా ఉండటమే కాకుండా ఇక్కడ పర్యటించే వారిపై ఔషధ మొక్కలపై నుండి వీచే గాలి ప్రభావం చూపి అనేక రుగ్మతలనుండి కాపాడుతుంది. దీనికి తోడు అనేక కాఫీతోటలు... పూల మొక్కల గుభాళింపులు మనల్ని కట్టిపడేస్తాయి. ఇరుకిరుకు దార్లు... సేదతీరేందుకు ఎక్కడ పడితే అక్కడ గుబురుగా ఉండే మామిడి, సపోటా తదితర చెట్లు ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తాయి. ఈ కొండలలో ప్రయాణించిన అనుభూతుల్న పంచుకునేవారు వీటిని దక్షిణ బదరీనాధ్‌గా పిలుస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు.
అరకు అందాలు
అరకు లోయల అందాలను గురించి చెపðకొనే కన్నా... కళ్లారా వీక్షిస్తేనే బాగుంటుంది. తూర్పుకనుమలలో కొలువైన ఈ ప్రాంతం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి దాదాపు 112 కిలో మీటర్లు దూరంలో ఉంది. ప్రకృతి పరచిన పచ్చని తివాచీ ల లాంటి ప్రాంతాలు, మలుపులు తిరిగే రోడ్లు... చిన్న చిన్న సెలయేళ్ల సవ్వడు లు, జలపాతాల హౌరు... సినీమా షఉటింగ్‌ల హడా విడులు... వీటన్నింటి నడుమ కేరింతలు కొడుతూ... ఆ వాతావరణాన్ని ఆస్వా దించే పర్యాటకులు... చూసి తీరాల్సిందే... అరకు అందాలు చూసేందు కు పర్యాటక శాఖ గెస్టు హౌజ్‌లు, ఏర్పాటు చేయగా... ఇక్కడ అనేక వసతి గృహా లు పర్యాటకుల సేవలందిస్తున్నాయి. ఇవి కాక చిన్న చిన్న హౌటళ్లు.. ఆ ప్రకృతి అందాల నడుమ మనం విహరించే ప్రాంతానికి నేరుగా భోజనాదులు సమకూర్చే క్యాంటర్స్‌ చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడి పద్మావతి గార్డెన్స్‌లో అనేక రకాల పూల మొక్కలు మదిని పులకరింప చేయగా... అరకు కేంద్రానికి దగ్గర్లో ఉన్న సున్నపురాయి ప్రాంతంలోని జలపాతాలు, సెలఏర్లు నడుమ విహరించడంతో మనసు తన్మయత్వానికి లోనవుతుందన్నది వాస్తవం.
బుర్రాకేవ్స్‌
ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పాటు చేసిన అద్భుత గుహ లివి. సున్నపురాయితో ఏర్పడిన ఈ గుహలు ఇప్పటికే అనేక సినిమాల్లో చూసాం. ప్రశాంతతకి మారు పేరుగా నిలచే ఈ గుహల్లోకి వెళ్లి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అనుభూతిని ఆస్వాదిం చొచ్చు. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రూట్‌ లో ఇది ఉంది. అరకు, బుర్రాకేవ్‌, అనంతగిరి లను చూసేందుకు ప్రత్యేక ప్యాకేజీలతో టూరిస్ట్‌ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక విశాఖ పట్నం నుండి శృంగవరపు కోట మీదుగా రైల్‌ మార్గం కూడా ఉంది. వీటిని చూసేందుకు వెళ్లాలనుకునే వారు... ముందుగా రైళ్లో వెళ్తే... అనేక గుహల మార్గం నుండి చేసే ఆ ప్రయాణం మధురానుభూతుల్ని మిగ ల్చడం ఖాయం.
విశాఖ సాగర తీరం...
సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ పట్నం సాగరతీరాన్ని చూస్త్తూ... ఎప్పటికైనా తాను 15 అశ్వాల మహా కావ్యాన్ని రాస్తా నని.. దానికి విశాఖ అని నామకరణం చేస్తానంటూ విప్లవకవి శ్రీశ్రీ చెప్పగా... అధునిక కవిత్వ సౌరభాలలో ప్రత్యేకత సంతరించుకున్న గుంటూరు శేషేం ద్ర శర్మ విశాఖ సాగర రమణీయతలకు సలాం చేయగా.. రమణ మహర్షి మొదలు చలం వరకు విశాఖ అందాలకు ముగ్ధులైపోయినవారే... సువిశాల ప్రాంగణంలా దర్శనమిచ్చే ఈ సాగర తీరం హొయలొలికించే వంపులతో... మధ్య మద్యలో రాతి గుట్టలతో... ఎగిసి పడే కెరటాలను.. తీరం చేరే అలల పరవళ్లు కాళ్లకు తాకు తుంటే హృదయం పులకరించి వేరుగా ఉంటుంది. మెత్తని పరుపులా ఉండే సన్నని ఇసుక తెన్నె లు... సముద్రంపై నుంచి వచ్చే పిల్లగాలులు... ఎగిసి పడుతుతున్న అలల నడుమ ఆటలాడు తూ... చిన్నారుల కేరింతలు ... ఆ వాతావరణమే వేరు.
ప్రపంచంలోనే సహజ సిద్దమైన నౌకాశ్రయంగా పేరుతెచ్చుకున్న ఈ సముద్రతీరం ఎందరో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సముద్ర తీరం వెంబడి రామకృష్ణ బీచ్‌, ఎన్టీఆర్‌ పార్క్‌, తెన్నేటి పార్క్‌, యారాడ, అప్పికొండ, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌ ఇలా అనేక ప్రాంతాలలో నెలకొల్పిన పార్కు లతో పాటుగా కైలాసగిరిపై కొలువైన శివ పార్వతులు అక్కడ నుండి కనిపించే విశాఖనగరం, భీమిలి రోడ్‌ కనువిందు చేసేవే.
భీమిలి బీచ్‌ :
ఈస్టిండియా కంపెనీకి వాణిజ్య కేంద్రంగా తొలిమున్సిపాలిటీగా పేరెన్నికగన్న భీమిలి అనేక అందాలకు నెలవు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి ప్రసాదించిన అద్భుత అందా లుగానే చెప్పక తప్పదు. ఎక్కువగా సినిమా పాటలు, ఫైట్లను ఇక్కడ చిత్రీకరించేందుకు మక్కువ చూపిస్తారు దర్శకులు. విశాఖ పరిసరాల్లో షఉటింగ్‌ ఉంటే కనీసం ఒక్క షాటైనా ఈ భీమిలి ఎర్రకొండల్లో ఉండటం నిర్మా తల సెంటిమెంటుకు నిదర్శనం.
హర్ల్సీ హిల్స్‌ :
మన రాష్ట్ర్ల్రంలోఅద్భుత జంతు జాలానికి నెల వై... అన్ని ఋతువుల్లోనూ... చల్లని ప్రదేశంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని... పేదవాడి వేసవి విడిదిగా మారిన ప్రాంతం హర్ల్సీ హిల్స్‌ అనటంతో సందేహం లేదు. బ్రిటీష్‌ పాలనలో కడప జిల్లాకు కలెక్టర్‌గా వ్యవ హరించిన హార్ల్సి అక్కడి వేసవి తాపం తట్టుకోలేక చిత్తూ రు సమీపం లోని కొండలపై సముద్ర మట్టానికి 1,265 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా రిసార్ట్స్‌ నిర్మించి పాలన సాగించినట్లు చెప్తారు. ఆ కారణంగానే ఈ కొండలకు హర్సలీ హిల్స్‌గా పేరొచ్చింది. రాష్ట్రంలో కొండ ల్ని బద్దలు కొట్టే ఎండలతో ఉక్కిరి బిక్కిరైనా.... ఇక్కడి ఉష్ణో గ్రతలు 20 నుండి 31 మధ్యనే ఉండటం విశేషంగా చెపð కోవాలి. ఆకు పచ్చని మైదానాలు, పచ్చదనం పరచుకున్న ట్లుండే వివిధ జాతులకు చెందిన చెట్లు.. ఇరుకు రోడ్లు నడుమ వాహనాలు చేసే ప్రయాణాలు... గంధపు చెట్ల గుభాళింపులు, పక్షల కిలకిలారావాలు, జంతు వుల అరుపులు... ఆహ్లాదంతో పాటు అద్భుత అనుభూతుల్ని కలిగిస్తాయి. ఇదేదో కొండ ప్రాంతం కదా అని అనుకోనఖ్ఖర్లే ఇక్కడ కూడా హౌటళ్లు, ఆడుకోవటానికి గ్రౌండ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి.
కుంతలా వాటర్‌ ఫాల్స్‌
ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవుల్లో ఉన్నాయి ఈ వాటర్‌ ఫాల్స్‌. పచ్చని ప్రకృతి అందాలకు తోడుగా సువాసనలు వెలజల్లే అనేక మూలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాదాపు 45 మీటర్ల ఎత్తునుండి దూకుతూ వస్తుండే ఈ జలపాతాలలో స్నానమాచరిస్తున్న శకుంతలని దుష్యంతుడు చూసాడని.. ఆమె అందానికి అచ్చెరు వొంది గాంధర్వ వివాహం చేసుకున్నాడని చెప్తారు. శకుంతల నిత్యం స్నానం చేసే ప్రాంతం కావటం వల్ల దీనిని కాల క్రమంలో కుంతల జలపాతాలుగా పిలుస్తున్నట్లు స్థానికులు చెప్తారు.
తలకోన జలపాతాలు..
ఆకుపచ్చని వృక్షాల నడుమ 270 అడుగుల ఎత్తునుండి హౌరు గా కిందికి పడుతూ ఉండే చూడముచ్చటైన జలపాతాలివి. చిత్తూరు జిల్లా కేంద్రానికి 49 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాల పరిసరాలను తితిదే, ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలు శ్రీవెంకటేశ్వర పార్క్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. స్థానికులతో పాటు తిరుపతి వచ్చే లక్షలా ది మంది భక్తులు ఈ జలపాతాలను వీక్షించి తమని తామే మైమరచి పోతుంటారు. అనేక సినిమాషఉటింగ్‌లు ఈ ప్రాంతంలో జరుగుతుం టాయి కనుక నిత్యం హడావిడిగానే ఉంటుంది. వేసవి కాలంలో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఎత్తిపోతల జలపాతాలు...
నాగార్జున సాగర్‌ ఆనకట్టకు 11 కిలోమీటర్ల దూరంలో సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలివి. కృష్ణానదికి ఉపనది అయిన చంద్ర వంక నది దాదాపు 70 అడుగుల ఎత్తునుండి ఉరికే ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న మెసళ్ల అభివృద్ధి కేంద్రంతో పాటు దగ్గర్లోని భౌద్ద ఆరామా లు ఆహ్లాదపరుస్తాయి. విజయవాడ, హైదరాబాద్‌ల నుండి ఇక్కడికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం ఉంది. ఇలా మరికొన్నింటి గురించి రాబెయే రోజుల్లో సవివరంగా తెలుసుకుందాం..