13, మార్చి 2012, మంగళవారం

సేద తీర్చే... వేసవి విడుదులు



వేసవి సమీపిస్తుంటే... మరో వైపు ఎండల వేడిని తట్టుకునేందుకు
వివిధ చల్లని ప్రదేశాలు చుట్టేయాలని భావిస్తుంటారంతా...
పిల్లలకి పరీక్షలు పూర్తి కావటంతో వాటిలో భారీగా మార్కులు వచ్చేసి...
ర్యాంకుల కోసం చేసిన మొక్కుబడులు తీర్చేందుకు
ఏ తిరుపతో... కాళహస్తో... శ్రీశైలవెూ... వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి...
అటు స్వామికార్యం... ఇటు స్వకార్యం రెండు పూర్తి చేసుకుంటారు....
ప్రతి ఏడాదీ ఉండే ఆ తంతులని కాస్త పక్కన పెట్టి... మనకి దగ్గర్లోనే ఉండి...
ప్రకృతిరమణీయత నడుమ పరవశింపచేసే.. అద్భుత ప్రపంచంలో....
ఈసారి మునిగి తేలే ప్రయత్నం చేస్తే... ఆదాతో పాటు ఆహ్లాదం సొంతం కావటం ఖాయం.

వేసవి విడిది అంటే ఎక్కడో దూరాన ఉన్న ఊటీ, కొడైకెనాల్‌, గోవా ఇలా అనేక ప్రదేశాలకి వెళ్లట మేనని... అక్కడ సేద తీరితే... జన్మధన్యమై పోతుందనే వారు మనలో ఎక్కువగానే ఉంటారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా గోవాలను, కొడైకెనాల్‌లని మించిన ప్రకృతి అందాలు... మన రాష్ట్రం లోనే ఉన్నా... వాటిపైనే ఎందుకనో మక్కువ. అయితే పెరుగుతున్న ఖర్చులు... రవాణా ఛార్జిలు... ఇతరాలు కలుపుకుంటే వేసవి తాపం తీర్చుకోవటం మాట అటుంచి జేబులు చిల్లుపడి... అపð మిగిలే పరిస్థితి ఉంటుంది సామాన్య జనాలకి... అందుకే మన రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తూ.. చల్లదనాన్ని... ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తూ... పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి కే సామాన్యుడి ఊటిగా చెప్పబడే అరకు, శ్రీశైలం అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్య ఉన్న జలపాతాలు, నాగార్జునసాగర్‌ అందాలు ఇలా వీటన్నిటినీ చూసి మైమరచిపోయే టూరి స్టులకు సేవలందించేందుకు అనేక హౌటళ్లు, రిసార్ట్‌లు, గెస్టుహౌజ్‌లు సిద్దంగా ఉన్నాయి. మరెందుకాలస్యం... బయలు దేరండి...
మన రాష్ట్రంలోని వేసవి విడుదులుగా ప్రసిధ్ది కెక్కిన ప్రాంతాలు మన భారత దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ధీటుగా నిలచేవే... వేలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ... వేసవిలో ఆహ్లాదాన్ని కలిగించేవే... మన సమీపంలో ఉండే ప్రాంతాలని దర్శించడం ద్వారా మన అనవసరపు ఖర్చుని తగ్గించుకోవటమే కాకుం డా మన పర్యాటక ప్రాంతాలపై అవగాహన గలిగించుకుని ... వాటిగురించి పదిమందికీ చెప్తూ.. మన టూరి జం అభివృద్థికి బాటలు వేసే ప్రయత్నం చేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మనమూ భాగస్వామ్యం కావచ్చు. మన రాష్ట్రంలోని వివిధ వేసవి పర్యాటక ప్రాంతా లను ఓ సారి పరికిస్తే...
అనంతగిరి కొండలు
సహజ సౌందర్యాల నడుమ ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేసే ఈ అనంతగిరి కొండలు విశాఖకు దగ్గర్లో ఉన్నాయి. ప్రకృతి అందాలే కాదు... అనేక ఔషధ గుణాలున్న మెక్కలు ఈ కొండల్లో పెరుగుతుండటం వల్ల ఈ ప్రాంతం చాలా చల్లగా ఉండటమే కాకుండా ఇక్కడ పర్యటించే వారిపై ఔషధ మొక్కలపై నుండి వీచే గాలి ప్రభావం చూపి అనేక రుగ్మతలనుండి కాపాడుతుంది. దీనికి తోడు అనేక కాఫీతోటలు... పూల మొక్కల గుభాళింపులు మనల్ని కట్టిపడేస్తాయి. ఇరుకిరుకు దార్లు... సేదతీరేందుకు ఎక్కడ పడితే అక్కడ గుబురుగా ఉండే మామిడి, సపోటా తదితర చెట్లు ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తాయి. ఈ కొండలలో ప్రయాణించిన అనుభూతుల్న పంచుకునేవారు వీటిని దక్షిణ బదరీనాధ్‌గా పిలుస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు.
అరకు అందాలు
అరకు లోయల అందాలను గురించి చెపðకొనే కన్నా... కళ్లారా వీక్షిస్తేనే బాగుంటుంది. తూర్పుకనుమలలో కొలువైన ఈ ప్రాంతం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి దాదాపు 112 కిలో మీటర్లు దూరంలో ఉంది. ప్రకృతి పరచిన పచ్చని తివాచీ ల లాంటి ప్రాంతాలు, మలుపులు తిరిగే రోడ్లు... చిన్న చిన్న సెలయేళ్ల సవ్వడు లు, జలపాతాల హౌరు... సినీమా షఉటింగ్‌ల హడా విడులు... వీటన్నింటి నడుమ కేరింతలు కొడుతూ... ఆ వాతావరణాన్ని ఆస్వా దించే పర్యాటకులు... చూసి తీరాల్సిందే... అరకు అందాలు చూసేందు కు పర్యాటక శాఖ గెస్టు హౌజ్‌లు, ఏర్పాటు చేయగా... ఇక్కడ అనేక వసతి గృహా లు పర్యాటకుల సేవలందిస్తున్నాయి. ఇవి కాక చిన్న చిన్న హౌటళ్లు.. ఆ ప్రకృతి అందాల నడుమ మనం విహరించే ప్రాంతానికి నేరుగా భోజనాదులు సమకూర్చే క్యాంటర్స్‌ చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడి పద్మావతి గార్డెన్స్‌లో అనేక రకాల పూల మొక్కలు మదిని పులకరింప చేయగా... అరకు కేంద్రానికి దగ్గర్లో ఉన్న సున్నపురాయి ప్రాంతంలోని జలపాతాలు, సెలఏర్లు నడుమ విహరించడంతో మనసు తన్మయత్వానికి లోనవుతుందన్నది వాస్తవం.
బుర్రాకేవ్స్‌
ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పాటు చేసిన అద్భుత గుహ లివి. సున్నపురాయితో ఏర్పడిన ఈ గుహలు ఇప్పటికే అనేక సినిమాల్లో చూసాం. ప్రశాంతతకి మారు పేరుగా నిలచే ఈ గుహల్లోకి వెళ్లి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అనుభూతిని ఆస్వాదిం చొచ్చు. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రూట్‌ లో ఇది ఉంది. అరకు, బుర్రాకేవ్‌, అనంతగిరి లను చూసేందుకు ప్రత్యేక ప్యాకేజీలతో టూరిస్ట్‌ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక విశాఖ పట్నం నుండి శృంగవరపు కోట మీదుగా రైల్‌ మార్గం కూడా ఉంది. వీటిని చూసేందుకు వెళ్లాలనుకునే వారు... ముందుగా రైళ్లో వెళ్తే... అనేక గుహల మార్గం నుండి చేసే ఆ ప్రయాణం మధురానుభూతుల్ని మిగ ల్చడం ఖాయం.
విశాఖ సాగర తీరం...
సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ పట్నం సాగరతీరాన్ని చూస్త్తూ... ఎప్పటికైనా తాను 15 అశ్వాల మహా కావ్యాన్ని రాస్తా నని.. దానికి విశాఖ అని నామకరణం చేస్తానంటూ విప్లవకవి శ్రీశ్రీ చెప్పగా... అధునిక కవిత్వ సౌరభాలలో ప్రత్యేకత సంతరించుకున్న గుంటూరు శేషేం ద్ర శర్మ విశాఖ సాగర రమణీయతలకు సలాం చేయగా.. రమణ మహర్షి మొదలు చలం వరకు విశాఖ అందాలకు ముగ్ధులైపోయినవారే... సువిశాల ప్రాంగణంలా దర్శనమిచ్చే ఈ సాగర తీరం హొయలొలికించే వంపులతో... మధ్య మద్యలో రాతి గుట్టలతో... ఎగిసి పడే కెరటాలను.. తీరం చేరే అలల పరవళ్లు కాళ్లకు తాకు తుంటే హృదయం పులకరించి వేరుగా ఉంటుంది. మెత్తని పరుపులా ఉండే సన్నని ఇసుక తెన్నె లు... సముద్రంపై నుంచి వచ్చే పిల్లగాలులు... ఎగిసి పడుతుతున్న అలల నడుమ ఆటలాడు తూ... చిన్నారుల కేరింతలు ... ఆ వాతావరణమే వేరు.
ప్రపంచంలోనే సహజ సిద్దమైన నౌకాశ్రయంగా పేరుతెచ్చుకున్న ఈ సముద్రతీరం ఎందరో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సముద్ర తీరం వెంబడి రామకృష్ణ బీచ్‌, ఎన్టీఆర్‌ పార్క్‌, తెన్నేటి పార్క్‌, యారాడ, అప్పికొండ, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌ ఇలా అనేక ప్రాంతాలలో నెలకొల్పిన పార్కు లతో పాటుగా కైలాసగిరిపై కొలువైన శివ పార్వతులు అక్కడ నుండి కనిపించే విశాఖనగరం, భీమిలి రోడ్‌ కనువిందు చేసేవే.
భీమిలి బీచ్‌ :
ఈస్టిండియా కంపెనీకి వాణిజ్య కేంద్రంగా తొలిమున్సిపాలిటీగా పేరెన్నికగన్న భీమిలి అనేక అందాలకు నెలవు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి ప్రసాదించిన అద్భుత అందా లుగానే చెప్పక తప్పదు. ఎక్కువగా సినిమా పాటలు, ఫైట్లను ఇక్కడ చిత్రీకరించేందుకు మక్కువ చూపిస్తారు దర్శకులు. విశాఖ పరిసరాల్లో షఉటింగ్‌ ఉంటే కనీసం ఒక్క షాటైనా ఈ భీమిలి ఎర్రకొండల్లో ఉండటం నిర్మా తల సెంటిమెంటుకు నిదర్శనం.
హర్ల్సీ హిల్స్‌ :
మన రాష్ట్ర్ల్రంలోఅద్భుత జంతు జాలానికి నెల వై... అన్ని ఋతువుల్లోనూ... చల్లని ప్రదేశంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని... పేదవాడి వేసవి విడిదిగా మారిన ప్రాంతం హర్ల్సీ హిల్స్‌ అనటంతో సందేహం లేదు. బ్రిటీష్‌ పాలనలో కడప జిల్లాకు కలెక్టర్‌గా వ్యవ హరించిన హార్ల్సి అక్కడి వేసవి తాపం తట్టుకోలేక చిత్తూ రు సమీపం లోని కొండలపై సముద్ర మట్టానికి 1,265 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా రిసార్ట్స్‌ నిర్మించి పాలన సాగించినట్లు చెప్తారు. ఆ కారణంగానే ఈ కొండలకు హర్సలీ హిల్స్‌గా పేరొచ్చింది. రాష్ట్రంలో కొండ ల్ని బద్దలు కొట్టే ఎండలతో ఉక్కిరి బిక్కిరైనా.... ఇక్కడి ఉష్ణో గ్రతలు 20 నుండి 31 మధ్యనే ఉండటం విశేషంగా చెపð కోవాలి. ఆకు పచ్చని మైదానాలు, పచ్చదనం పరచుకున్న ట్లుండే వివిధ జాతులకు చెందిన చెట్లు.. ఇరుకు రోడ్లు నడుమ వాహనాలు చేసే ప్రయాణాలు... గంధపు చెట్ల గుభాళింపులు, పక్షల కిలకిలారావాలు, జంతు వుల అరుపులు... ఆహ్లాదంతో పాటు అద్భుత అనుభూతుల్ని కలిగిస్తాయి. ఇదేదో కొండ ప్రాంతం కదా అని అనుకోనఖ్ఖర్లే ఇక్కడ కూడా హౌటళ్లు, ఆడుకోవటానికి గ్రౌండ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి.
కుంతలా వాటర్‌ ఫాల్స్‌
ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవుల్లో ఉన్నాయి ఈ వాటర్‌ ఫాల్స్‌. పచ్చని ప్రకృతి అందాలకు తోడుగా సువాసనలు వెలజల్లే అనేక మూలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాదాపు 45 మీటర్ల ఎత్తునుండి దూకుతూ వస్తుండే ఈ జలపాతాలలో స్నానమాచరిస్తున్న శకుంతలని దుష్యంతుడు చూసాడని.. ఆమె అందానికి అచ్చెరు వొంది గాంధర్వ వివాహం చేసుకున్నాడని చెప్తారు. శకుంతల నిత్యం స్నానం చేసే ప్రాంతం కావటం వల్ల దీనిని కాల క్రమంలో కుంతల జలపాతాలుగా పిలుస్తున్నట్లు స్థానికులు చెప్తారు.
తలకోన జలపాతాలు..
ఆకుపచ్చని వృక్షాల నడుమ 270 అడుగుల ఎత్తునుండి హౌరు గా కిందికి పడుతూ ఉండే చూడముచ్చటైన జలపాతాలివి. చిత్తూరు జిల్లా కేంద్రానికి 49 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాల పరిసరాలను తితిదే, ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలు శ్రీవెంకటేశ్వర పార్క్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. స్థానికులతో పాటు తిరుపతి వచ్చే లక్షలా ది మంది భక్తులు ఈ జలపాతాలను వీక్షించి తమని తామే మైమరచి పోతుంటారు. అనేక సినిమాషఉటింగ్‌లు ఈ ప్రాంతంలో జరుగుతుం టాయి కనుక నిత్యం హడావిడిగానే ఉంటుంది. వేసవి కాలంలో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఎత్తిపోతల జలపాతాలు...
నాగార్జున సాగర్‌ ఆనకట్టకు 11 కిలోమీటర్ల దూరంలో సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలివి. కృష్ణానదికి ఉపనది అయిన చంద్ర వంక నది దాదాపు 70 అడుగుల ఎత్తునుండి ఉరికే ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న మెసళ్ల అభివృద్ధి కేంద్రంతో పాటు దగ్గర్లోని భౌద్ద ఆరామా లు ఆహ్లాదపరుస్తాయి. విజయవాడ, హైదరాబాద్‌ల నుండి ఇక్కడికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం ఉంది. ఇలా మరికొన్నింటి గురించి రాబెయే రోజుల్లో సవివరంగా తెలుసుకుందాం..