13, మార్చి 2012, మంగళవారం

చురకలేసే దాసం గోపాలకృష్ణ

చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకం రాసి, మంచిపేరు తెచ్చుకున్న రచయిత దాసం గోపాలకృష్ణ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ నాటకం ఆధారంగా జయచిత్ర టైటిల్‌ రోల్‌ పోషించగా 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' చిత్రం విడుదలై విజయం సాధించింది కూడా. చిలకా గోరింక, రాగజ్వాల, పున్నమిదేవి వంటి నాటకాలు కూడా ఆయనకు పే తెచ్చాయి. హాస్యంతో సాంఘిక సమస్యలపై చురకలు వేసేవారు రచనల ద్వారా.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కోడవల్లి గ్రామంలో 13-2-1930న జన్మించి బి.ఎ.వరకు చదువుకున్నారు. అడవి బాపిరాజు, నండూరి రామకృష్ణమాచార్యల శిష్యుడు. వాణిశ్రీ కాకముందు తన అసలు పేరు (రత్నకుమారి)తో చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో టైటిల్‌ రోల్‌ పోషించి పేరు తెచ్చుకుంది.
స్వీయ దర్శకత్వంలో గరికపాటి రాజారావు 'పుట్టిల్లు' నిర్మిస్తున్నప్పుడు మద్రాసుతో పరిచయం పెంచుకున్నారు. అయితే ఘోస్ట్‌ రైటర్‌గా కొనసాగారు. 'పసివాడి పగ' చిత్రంతో 1972లో పాటల రచయిత అయ్యారు 'సీసామీద చెయ్యి....' పాటను రాసి. 'చిల్లరకొట్టు చిట్టెమ్మ, కుడి ఎడమైతే, మంగళ తోరణాలు, ప్రెసిడెంట్‌ పేరమ్మ' తదితర చిత్రాలకు కథ, మాటలు రాసారు దాసం గోపాలకృష్ణ.
'చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, పసుపు పారాణి, తిరుపతి, కళ్యాణి, ప్రణయగీతం, రావణుడే రాముడైతే, దేవదాసు మళ్లిd పుట్టాడు' వంటి చిత్రాల్లో సుమారు 80 పాటలు రాసారు. అయినా చాలా పాటలు పేరు తెచ్చాయి.
'సూడు పిన్నమ్మా పాడు పిల్లడూ... సువ్వీ కస్తూరి రంగా... సువ్వీ కావేటరంగ... ఏంటబ్బాయా చీటికి మాటికి...' పాటలు 'చిల్లరకొట్టు చిట్టెమ్మ'లోనూ, 'గుబులు పుట్టిసావు, ఓ. మల్లికా,... నవరాగానికి నడకలు వచ్చెనే..., పాటలు కళ్యాణి చిత్రంలోనూ, ఆ ముద్దబంతులు..., రేవులోని చిరుగాలి..., పసుపు పారాణిలోను, పాలకొల్లు సంతలోన..., మాపల్లె వాడలకు... చందమామ వచ్చిందమ్మా...., జోరుమీదున్నావు తుమ్మెదా... అమ్మా మావాడు... పాటలు శివరంజని లోనూ, ఉప్పు చేప పప్పుచారు..., ఉస్కో ఉస్కో పిల్లా... పాటలు రావణుడే రాముడైతే' దేశం పన్నెండు సార్లు నారాయణమ్మ... తిరుపతి చిత్రంలోనూ ఆయన రాసిన పాటలు పాప్యులర్‌ అయ్యాయి. 1993లో మృతి చెందారు.