27, అక్టోబర్ 2010, బుధవారం

మంత్రులంతా విద్రోహదినాన్ని పాటి౦చాల్సిందే : విమలక్క


నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని, తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులంతా విద్రోహదినాన్ని పాటించాలని సమష్టి కార్య నిర్వాహక కమిటీ రాష్ట్ర నాయకులు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ విమలక్క. కోరారు.

నల్లగొండలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్నికలు కూడా పోరాట రూపమేనని, ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగిస్తునే ఎన్నికల ప్రక్రియను కూడా లక్ష్యసాధనకు ఉపయోగించుకోవాలన్న సిద్ధాంతంతోముందుకు సాగుతోందని
తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మాత్రమే గద్దర్ ఫ్రంట్‌తో విభేదించామని, ఫ్రంట్ ఎజెండా తమ ఎజెండా ఒక్కటేనని అన్నారు. భవిష్యత్తులో ఈ భేదాభిప్రాయలు తొలగిపోయి తెలంగాణ ఉద్యమ శక్తులన్ని ఏకత్రాటిపై సాగుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. విద్యార్థులను జెండాలు, పార్టీల వారిగా చీల్చి పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని ... తెలంగాణ సాధన కోసం ప్రజలు సాగిస్తున్న లొల్లికి మద్దతు ఇవ్వకుండా పార్టీలు ఢిల్లీలో లొల్లి చేస్తు గందరగోళం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల త్యాగపూరిత పోరాటాలతో సాధించిన డిసెంబర్ 9న ప్రకటనను పార్టీలు శాంతి ఒప్పందం ద్వారా నీరుగార్చాయని విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ సమస్యకు పరిష్కారం కాకుండా ప్రత్యామ్నాయాలు మాత్రమే చూపుతుందని, ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 31పిదప తెలంగాణ ఉద్యమం బలపడకుండా రాజకీయ పార్టీలుఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటిదాక సాగిన తెలంగాణ ఉద్యమాలు ఏక వ్యక్తి నాయకత్వం క్రింద సాగినందునే సత్ఫలితాలు ఇవ్వలేదని, అందుకే తాము సమష్టి కార్యనిర్వాహక కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రికి కోటీ ఉత్తరాల కార్యక్రమంలో అంతా పాల్గొని తెలంగాణ సాధన ఆకాంక్షను కేంద్రానికి బలంగా తెలుపాలని వారు పిలుపునిచ్చారు