12, నవంబర్ 2010, శుక్రవారం

వెక్కిరిస్తున్నదృశ్య శ్రవణాలు

విద్య ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దృశ్య శ్రవణ బోధన ఘోరంగా విఫలమైంది. ప్రాథమిక విద్యను మెరుగుపర్చడానికి ప్రభుత్వం సక్సెస్ పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాలలకు కలర్ టీవీలు, డిష్‌లను అందజేసింది. మన టీవీ కార్యక్రమాలను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసింది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వం, పాలకుల స్వార్థం వల్ల అమలుకు నోచుకోకపోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. మరోవైపు రూ. లక్షలాది నిధులు వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితం తాంబుళం ఇచ్చాం... ఇక తన్నుకుచావండి అన్న చందంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన మన టీవీలు పాఠశాలల్లో అటకెక్కాయి.

గణి తం, సామాన్య, ఆంగ్లం, సాంఘిక శాస్త్రాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పే అంశాలను మన టీవీలో పొందుపర్చారు..మన టీవీలను ప్రారంభించి అంశాలను చెప్పిన సందర్భాలు లేవు. వీటి ద్వారానే టెలికాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్న జరగడం లేదు. ఫలితంగా రూ. లక్షలాది రాజీవ్ విద్యామిషన్ నిధులు నిరుపయోగంగా మారాయి.

చాలా చోట్లా పనిచేయక మూలన పడి ఉండి అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. మరికొన్ని పాఠశాలల్లో టీవీలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లినట్లు సందర్భాలున్నాయి.