28, జనవరి 2011, శుక్రవారం

ఆమ్ ఆద్మీ బీమా క్లెయిమ్‌లు పరిష్కారం ఎప్పుడూ ..?

పేదల కోసం ప్రవేశ పెట్టిన ఆమ్ ఆద్మీ బీమా పథకం సంవత్సరాలు గడుస్తున్నా క్లెయిమ్‌లు పరిష్కారం కావడం లేదు. డ్వా క్రా సంఘాల మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2008-09 నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద బీమా చేసిన డ్వాక్రా మహిళ కుటుంబ యజమాని మృతి చెందితే బీమా కంపెనీలు డబ్బు చెల్లించాల్సి ఉం టుంది. మృతి చెందిన వెంటనే అంత్యక్రియల కోసం రూ.5వేలు ఇవ్వాలి. తరువాత ప్రమాదవశా త్తు మృతి చెందితే రూ.70వేలు, సహజ మరణమైతే రూ.30వేలు చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఈ పథకం ఫైళ్ళు పైసలుంటేనే కదులుతున్నాయి. బీమా కంపెనీ కింద మండలానికి ఒక మిత్ర కార్యకర్తను నియమించారు.

ఒక్కొక్క కేసుకు జిల్లాసమాఖ్య నుంచి రూ.500 చొప్పున పరిహారం ఇస్తారు. 2008-09 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆయా కుటుంబాలకు పరిహారం అందలేదు. యజమాని మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు మాత్రం రావడం లేదు. డీఆర్‌డీఏలో దీనికోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అవినీతికి నిలయంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోగస్ రికార్డులను సృష్టించి అంత్యక్రియల పేరుతో డబ్బు డ్రా చేశారు.

సమాచారం అందిన 24 గంటల్లో మృతి చెందిన యజమాని కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఇచ్చి రావాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అంత్యక్రియల కోసం ఇచ్చే రూ.5వేలు కూడా బీమా సొమ్ములో కలిపి ఇస్తున్నారు. సమాఖ్యలోని పలుకుబడి, పరపతి ఉన్న వారు వెంటనే క్లెయిమ్‌లను సెటిల్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆమ్ ఆద్మీ బీమా యోజనలో ఉన్న డబ్బును ఇతర పథకాలకు మరలించడం వలన ఇక్కడ క్లెయిమ్‌ల పరిష్కారానికి జాప్యం జరుగుతోంది.