విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన, ఆసక్తి పెంచి యువ శాస్త్రవేత్తల తయారీకి 'సిద్దం చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనల మేరకు రూపొన్దుకున్న అతిముఖ్యమైన కార్యక్రమంగా ఇన్‌స్పెయిర్ (ఇన్నోవేషన్ ఇన్ సైన్సు ఫర్‌స్యూట్ ఫర్ ఇన్ స్పెయిర్ రీసెర్చ్)ను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ0 రూపొందించింది.
ఇందులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి సైన్సులో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఉన్నత పాఠశాలలోను 6, 7,8 తరగతుల నుంచి ఒకరిని 9,10 తరగతుల నుంచి ఒకరిని అలాగే యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఆయా పాఠశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు వంతున ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సొమ్ములో 50 శాతాన్ని ఆ విద్యార్థి తాను రూపొందించే ప్రాజెక్టుకు వినియోగించవలసి ఉంటుంది.
మిగిలిన సొమ్మును జిల్లా స్థాయిలో తన ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వెచ్చించవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఉన్నతి కల్పిస్తారు. ఈ విధంగా జాతీయ స్థాయికి చేరుకున్న యువ శాస్త్రవేత్తలకు తగిన వేతనాలు కల్పిస్తారు. ఇన్‌స్పయిర్ విధానంలో సైన్సులో విద్యార్థి ప్రతిభ గీటురాయిగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింతమంది ప్రతిభావంతులను తయారు చేసే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఆశించవచ్చు.