23, ఫిబ్రవరి 2011, బుధవారం

మరో ధృవతార రాలిపోయింది

స్వర్ణయుగంనాటి మరో ధృవతార రాలిపోయింది. సినీరంగంలో 50 ఏళ్ల పాటు ఓ వెలుగువెలిగిన ఆ తార భౌతికంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. అలనాటి చిత్రసీమలో సుగంధ పరిమళాలను వెదజల్లి ప్రేక్షకులకు హాయిగొలిపిన ఆ తార మరెవరో కాదు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (96). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలను పోషించిన ఆయన దాదాపు 350 చిత్రాల్లో నటించారు. కృష్ణాజిల్లాలోని కోలవెన్ను మండలం ఆయన స్వస్ధలం. పాత తారలు చాలామంది మాదిరిగానే మిక్కిలినేని కూడా నాటకరంగం నుంచే సినిమారంగానికి వచ్చారు. 'దీక్ష' చిత్రం ద్వారా 1949వ సంవత్సరంలో చిత్రసీమలోనికి వచ్చిన ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్టచేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భైరవద్వీపం' ఆయన చివరి చిత్రం. మిక్కిలినేని మృతికి పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు.