27, మార్చి 2011, ఆదివారం
వేసవిలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
వేసవిలో డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.వి.రమేష్ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే అన్ని రకాల జ్వరాల వివరాలనూ వారానికోసారి నివేదికలు ఇవ్వాలన్నారు. వీటి ఆధారంగా వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పారిశుద్ధ్య నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులకు ఆదేశించాలన్నారు. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మూడు సార్లు మలాథిన్ స్ప్రే చేయించాలని, నీటి వనరుల పరిస్థితులపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఆశ కార్యకర్తలకు నిర్ధేశించిన ఏరియాలో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జ్వరం వచ్చిన ప్రతి రోగికీ క్లోరిఫిన్, ప్రైమిఫిన్ మాత్రలు మూడు రోజుల పాటు వేయించాలని చెప్పారు.