కడప ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడప ఉప ఎన్నిక ఫలితాలెలా ఉంటాయని అడిగితే, ‘‘నాకు తెలిసినంతవరకు జగన్‌కే అనుకూలంగా ఉంటాయి. న్యాయంగా, సాంప్రదాయికంగా చూసినా ఆయనే గెలిచే అవకాశాలున్నాయి. అసలక్కడ నామినేషన్లు పడతాయనే నేను అనుకోవడం లేదు’’అని బదులిచ్చారు. నామినేషన్లు పడకపోవడమేంటి, కాంగ్రెస్ తరపున కూడా వేయరా ఏమని ప్రశ్నిస్తే, ‘‘నేనింతకంటే ఎక్కువ మాట్లాడను. మీరే ఆలోచించుకోండి’’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు వచ్చాయంటున్నారు.
అసలేమీ లేని జగన్‌కు మూడు సీట్లు రావడం గురించి మాట్లాడరా? దీనంతటికీ కారణం మా పార్టీవాళ్లే. జగన్‌ను వాళ్లెవరూ ప్రత్యర్థిగా భావించకపోవడంవల్లే ఇలాంటి ఫలితాలొస్తున్నాయి. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని మాట్లాడుతున్నారు. జగన్‌ను ప్రత్యర్థిగా చూడలేక పోవడమనే బలహీనత. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని..జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.