2, మార్చి 2011, బుధవారం

ఇది ప్రజాస్వామ్యమా..? రాక్షస పాలన..?

మొన్న సోంపేట సంఘటన మరువక ముందే ప్రభుత్వం మరో దుర్మార్గపు చర్యకు పాల్పడడమనేది ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించరని ఉత్తరాంధ్రా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదాడ మోహనరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశ ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకర్లపల్లిలో పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురిని దారుణంగా దగ్గర నుంచే కాల్చి చంపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సైనికపాలన రీతిలో ముందుకెళ్లడాన్ని దళిత ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. తక్షణమే ప్రభుత్వం గద్దె దిగాలని, ఈ ప్రభుత్వాన్ని పాలించే అర్హత లేదని ఎవరిని ఆదేశించి క్రమశిక్షణలో పెట్టే సక్రమంగా ప్రభుత్వాన్ని నడిపించే స్థోమత ఈ ప్రభుత్వానికి లేదని, చనిపోయిన మృతుల కుటుంబానికి పది లక్షలు ఏక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి రెండు లక్షలు చెల్లించి వారి వైద్య ఖర్చులు కూడా ఏర్పాటు చేయాలనుకున్న థర్మల్‌ ప్లాంట్‌ను తక్షణమే అక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని మరే ఇతర కంపెనీ అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.