27, సెప్టెంబర్ 2012, గురువారం

వైకాపా నిర్లక్ష్యం గిరిజనుల నిలదీత

భద్రాచలంలో బుధవారం జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో తిరుగుబాటు గళం పెల్లుబికింది. గతంలో మాదిరిగానే ఈ సమావేశంలో కూడా వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ గిరిజనులు ఎదురుదాడికి దిగారు. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గిరిజనులు జిల్లా నాయకత్వాన్ని నిలదీశారు. ఈ సమయంలో జిల్లా కన్వీనరు పువ్వాడ అజయ్‌కుమార్‌కు, వివిధ మండలాలకు చెందిన గిరిజన నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. సభా వేదికపైకి ఒకే వర్గానికి చెందిన నాయకులను పిలిచి గిరిజనులను వేదికపైకి పిలవకుండా కించపరిచారంటూ సమావేశంలో నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వివాదంకు దిగిన గిరిజన నాయకులపై జిల్లా నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో డివిజన్లో భద్రాచలం, చింతూరు మండలాల్లో వైకాపా కోసం కష్టపడుతున్నగిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చూస్తున్నారని జిల్లా నాయకత్వాన్ని ఆ మండలానికి చెందిన పలువురు గిరిజన నాయకులు నిలదీశారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. కష్టపడుతున్న వారిని విస్మరించి ఒక సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే డివిజన్‌స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులను జిల్లా నాయకులు సర్ది చెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించారు.