2, ఫిబ్రవరి 2011, బుధవారం

కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి?

కాంగ్రెస్‌తో పొత్తుకు సై అనాలా? వద్దా? ప్రభుత్వంలో చేరడంపై ఏం చేయాలి? చేరే పక్షంలో ఏ స్థాయి పదవులకు బేరం పెట్టాలి? నాలుగైదు పదవులు తీసుకొని ఇలా ప్రభుత్వంలో చేరిపోతే.. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఏం కావాలి? వారికి న్యాయం జరిగేదెలా?.. ఇవీ ప్రస్తుతం ప్రజారాజ్యంలోని వివిధ స్థాయి నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.

సోనియాతో భేటీలో విలీనం ప్రస్తావనే వస్తుందని విశ్వసిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగానే విస్తృత కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. "విలీనం ప్రతిపాదనే వస్తే.. ముఖ్యమంత్రితో సమాన స్థాయి కలిగిన చిరంజీవికి అంతటి ప్రాధాన్యమున్న పదవినే అడిగే అవకాశం ఉంది. ఆయనకు ఆ స్థాయి పదవి వస్తేనే.. పార్టీని నమ్ముకున్న నేతలను కొంతైనా పైకి తీసుకురాగలుగుతారు'' అని పార్టీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పీఆర్పీ వెళ్లి కాంగ్రెస్ సముద్రంలో కలిస్తే తమ పరిస్థితేమిటన్నది ద్వితీయ శ్రేణి నేతల ప్రధాన ప్రశ్నగా ఉంది.