బిఎస్ఎన్ఎల్‌లో 'ఫైబర్ టు ద హోం (ఎఫ్‌టిటిహెచ్)' సేవలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సేవలను త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. దీంతోపాటు... ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతోన్న పోటీని దీటుగా ఎదుర్కొనే క్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ కొడితే చాలు...బిఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ మన ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.
దరఖాస్తు నింపడం దగ్గరనుంచి అతనే చూసుకుంటాడు. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లను కావాలంటే... 94000 54141 నంబరుకు కాల్ లేదా బిబి అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపడం కానీ చేయవచ్చు. ఇక ఎఫ్‌టిటిహెచ్ అందుబాటులోనికి రావడంతో మరెన్నో టెలికాం సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. వాయిస్, డాటా, వీడియో తదితర సౌకర్యాలను ఎఫ్‌టిటిహెచ్ ద్వారా వినియోగదారులు పొందవచ్చు. ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ (ఒఎఫ్‌సి) ద్వారా ఎఫ్‌టిటిహెచ్ సేవలనందిస్తారు.