దేశవ్యాప్తంగా రవాణా రంగానికి పెనుభారంగా మారిన టోల్‌టాక్స్ సమస్యకు ఈ నెల 25వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపకపోతే డిసెంబర్ 5న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఎఐఎంటిసి (ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్) అధ్యక్షుడు జిఆర్ షణ్ముగప్ప ప్రకటించారు
టోల్‌టాక్స్ సమస్య పరిష్కారంపై గతంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో స్పష్టమైన హామీ వచ్చినప్పటికీ దాన్ని కార్యరూపంలోకి తేలేదని విమర్శించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తాము నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న 259 టోల్‌ప్లాజాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నా 777 కొత్త టోల్‌ప్లాజాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని భారం మోపడం తగదన్నారు.