14, నవంబర్ 2010, ఆదివారం

వనభోజనాలకు కొత్త భాష్యం

శివ, కేశవులకు ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. ఈ మాసంలో ఉసిరి చెట్ల కింద పనస ఆకుల విస్తళ్ళలో వనభోజనం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని సంప్రదాయం. ప్రకృతిపరంగాను వనభోజనాలకు ఒక ప్రత్యేకత ఉంది. పచ్చటి చెట్లు, హరితవనాలు కింద వన భోజనాలు చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చని ప్రతీతి.

నగరాలు, పట్టణాలలో అపార్టుమెంట్ అంతరాలను చెరిపేసి వారాంతపు వినోదానికి వనభోజనాలు మంచి వేదికలవుతున్నాయి. తరతమ బేధం లేకుండా భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులు కలిగిన వారందరినీ ఒక్కచోటికి చేర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆత్మీయతను పెంచుతున్నాయి.

గతంలో 'పులిహోర, పూర్ణాలు మేము తెస్తాం.. పచ్చళ్ళు, కూరలు పొరిగింటివారు తీసుకురావాలి..' అని వంతులు వేసుకొనేవారు. ఇప్పుడంతా కాలం మారిపోయింది. చేతి చమురు వదిలినా క్యాటరింగే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఫలానా 'మెనూ' కావాలంటూ ఎంచక్కా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఆడి, పాడి ఆనక కడుపునిండా ఆరగించి ఆధునిక వనభోజనాలకు కొత్త భాష్యాన్ని చెబుతున్నారు.