బ్లూరే ప్రొడక్షన్స్ నిర్మించిన 'కారాలు... మిరియాలు' పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు, ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ అతిథులుగా విచ్చేసి ఆడియో విడుదల చేశారు.
స్వీయదర్శకత్వంలో పసుపులేటి వెంకటరామారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు చక్రి, నటి రత్నసాగర్, ప్రసన్నకుమార్, శివచెన్ను, రవీంద్ర పెండ్యాల, చిత్రకథానాయకుడు నవకేశ్, మహేష్‌రాయల్, రాఘవయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ 'కొత్తవారితో, విదేశాల్లో తీసిన ఈ చిత్రం పేరు మాత్రం తెలుగుదనంతో ఉంది. రిస్క్‌తో సినిమా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. కథబాగుంటేనే సినిమా ఆదరణ పొందుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ఇంకా రావాలి' అన్నారు.
'ఈ సినిమా యూనిట్ అంతా యువకులే. వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని రమేష్‌ప్రసాద్ పేర్కొన్నారు.చక్రి మాట్లాడుతూ 'ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న జంట మ్యూజిక్ డైరక్టర్లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పాటలు బావున్నాయి' అన్నారు.
దర్శక, నిర్మాత పసుపులేటి వెంకటరామారావు మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాం. కొత్త ఆలోచనతో తీసిన ప్రేమకథా చిత్రమిది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో నవకేష్, మధుశాలిని, రత్నసాగర్, లండన్ సునీల్, హాలీవుడ్ నటుడు హ్యారీపోటర్ ఫేమ్ మైఖేల్‌గామన్ నటించారు.ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి, ఛాయాగ్రహణం: మహేష్‌రాయల్, పాటలు; రవీంద్రపెండ్యాల.