చిన్న సినిమాలు ఆదరణ పొందితే అది పరిశ్రమకే ఆనందం. చిన్న సినిమా బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది అని అంటారు. తాజాగా విడుదలైన అహనాపెళ్లంట చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. పాతికేళ్ల క్రితం వచ్చిన జంధ్యాల అహనాపెళ్లంట ఇప్పటికీ క్లాసికల్ చిత్రంగా ఆదరణ పొందుతూనే ఉంది. అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కూడా వినోదానికి పెద్దపీఠవేస్తూ రూపొందించారు. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా శనివారం ఫిలిం ఛాంబర్‌లో యూనిట్ సక్సెస్‌మీట్ ఏర్పాటుచేసింది. శ్రీహరి, దర్శక, నిర్మాతలు వీరభద్ర, అనీల్, సంగీత దర్శకుడు కుంచె రఘు, మాటల రచయిత శ్రీధర్, నటుడు నాగినీడు, సహదర్శకుడు సాయినాథప్రసాద్, డ్రాగన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల నుండి సూపర్‌హిట్ టాక్‌తో సినిమా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు వీరభద్ర తెలిపారు. ఇంతటి విజయం సాధిస్తుందని శ్రీహరి ముందే చెప్పారు. నరేష్, బ్రహ్మానందం పాత్రలు సినిమాకు బలాన్నిచ్చాయి. ఇచ్చిన మాటకోసం నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
పాజిటివ్ ఎనర్జీతో ఈ చిత్రం తీసినట్టు నిర్మాత చెప్పారు. శనివారం నుండి యూనిట్ విజయయాత్రలో పాల్గొంటుంది. వైజాగ్, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్‌లో ఈ యాత్ర జరుగుతుందన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ వీరభద్రం వినిపించిన కథలో కొత్తదనం ఉంది. తొలుత అతడిపై నమ్మకం లేనప్పటికీ, కథ వివరించాక నమ్మకం కలిగింది. నిర్మాత చక్కగా ప్లాన్ చేసి చిత్రీకరణ జరిపారు. ఇతర యూనిట్ సభ్యులంతా పూర్తిసహకారాన్ని అందజేశారు. రీమిక్స్ పాటకు మంచి స్పందన లభిస్తోంది అన్నారు. ఈ సమావేశంలో మిగతా యూనిట్ సభ్యులంతా తమ స్పందన తెలియజేశారు.