5, మార్చి 2011, శనివారం

పోటీ పడి పెరుగుతున్న బంగారం,వెండి

న్యూఢిల్లిd: ఆల్‌టైం రికార్డు స్థాయి ధరలను కొనసాగించడంలో విలువైన లోహాలు పోటీ పడుతున్నాయి. గత కొద్ది వారాలుగా బంగారం, వెండి మధ్య జరుగుతున్న ధరల పెరుగుదల యుద్ధం మరింతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటి బులియన్‌ సెషన్‌లో వెండి ధర ఏకంగా 1600 పెరిగి 53,200 రూపాయల సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. స్టాండర్డ్‌ బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 175 రూపాయలు పెరిగి 21,220 రూపాయలకు చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్ళిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోళ్ళు సంతృప్తికరంగా సాగుతున్నాయని, అందువల్లే విలువైన లోహాల ధరల పెరుగుదల కొనసాగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర కిలోకు 655 రూపాయలు పెరిగి 52,300 రూపాయలకు చేరగా, 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 175 రూపాయలు పెరిగి 21,100 రూపాయలకు చేరింది. వంద వెండి నాణాల కొనుగోలు ధర 55,800, అమ్మకం ధర 56,300 రూపాయలుగా కొనసాగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31 సంవత్సరాల గరిష్ఠస్థాయిలో 35 డాలర్లకు చేరింది. లిబియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుండడం, ప్రత్యామ్నాయ పెట్టుబడులకు బులియన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిస్తుండడంతో ఔన్సు బంగారం ధర 17.5 డాలర్లు పెరిగి 1432.80 డాలర్లకు పెరిగింది.