5, మార్చి 2011, శనివారం

12వ శతాబ్దంనాటి పాండవుల నిర్మిత ఆలయం

గోవాలోని మహాదేవాలయం 12వ శతాబ్దంనాటిది. దక్షిణ గోవాలోని తంబ్డెసుర్లాలోని అన్మోద్‌ ఘాట్‌ అడవులలో ఈ గుడి వుంది. ఈ ప్రాంతాన్ని భగవాన్‌ మహావీర్‌ అభయారణ్య ప్రాంతమంటారు. స్థానికుల కథనం ప్రకారం త్రాచుపాములు ఆ గుడిలో సంచరిస్తాయట. ఈ ప్రాంతంలో రబడానది పాయలుగా ప్రవహించి మాండోవీలో కలుస్తుంది. ఇక్కడ నెమళ్లు కానవస్తాయి. మహాదేవ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాదంబులు నిర్మించారట. శిల్ప నిర్మాణం యాదవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయంలో గర్భగృహం, స్థంబాల మండపం వున్నాయి. తల లేని నంది విగ్రహం కానవస్తుంది. హోయసాల, జైనుల సంస్కృతి శిల్ప సంపదలో కానవస్తాయి. కాదంబరాణి కమలాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారంటారు. పాండవులు వనవాసంలో వుండగా, తొందర పడి ఈ ఆలయ నిర్మాణం చేశారనే వాదన వుంది. ఒకే రాత్రిలో నిర్మించిన కారణాన అసంపూర్ణంగానే వుందట.