31, అక్టోబర్ 2010, ఆదివారం

నేటికీ రాని నోటరి రద్దు జి ఓ ... ఇబ్బందుల్లో విద్యార్ధులు

ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ కాలహరణకు కారణమవుతున్నాయి. వృత్తి విద్యాకోర్సులు, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పొందేందుకు గతంలో తాము చదువుతున్న కళాశాలల్లో కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు అందిస్తే సరిపోయేది. తరువాత పది రూపాయల స్టాంపుతో నోటరీ చేయించి ఆన్‌లైన్‌లో పెట్టాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ప్రభుత్వ ప్రకటన తరువాత పది రూపాయల స్టాంపు ధర పెరిగింది. రూ. 100 నుండి రూ. 200 వరకు స్టాంపు ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో నోటరీ చేయించడానికి మరో రూ. 100 వరకు చేతి చమురు వదిలించు కోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. దీంతో అష్టకష్టాలు పడి విద్యార్థులు అన్నీ సరిచూసుకుని సర్టిఫికెట్లు అన్‌లైన్‌లో పెడితే నెట్‌లో లోపాలున్నాయని, అవి అందలేదన్న సాకుతో రీయింబర్స్‌మెంట్‌ ఎగవేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమమం చేసుకుంది. ఈ విధానాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. పలు చోట్ల ఆందోళనలు కొనసాగించారు. ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో నోటరీ విధానాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఇందుకు జీవో మాత్రం జారీ చేయలేదు.