ఏ స్థాయిలో గ్రామాల్లో మైక్రో సంస్థలు వేళ్లూనుకుపోయాయో ఈ గణాంకాలు చూస్తే తేటతెల్లమవుతుంది. ఆక్టోపస్ మాదిరిగా లక్షలాది మందిని కమ్మేసుకుంటూ లాభాల శాతాన్ని అనూహ్యమైన రీతిలో పెంచుకుంటూ పోయింది. వడ్డీల శాతాలు చూస్తే గుండె గుభేలనకమానదు. దాదాపు 26శాతం నుంచి 37 శాతం వరకు ఈ సంస్ధలు మహిళల నుంచి వడ్డీలు పిండు తున్నాయి. ఈ వడ్డీలు కట్టికట్టి గ్రామీణ ప్రాంతంలో ఆత్మహత్యల శాతం భారీగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ సంస్ధల పరిధిలోకి దాదాపు 557518 మంది మహిళలు వెళ్లిపోయారంటే ఆతిశయోక్తి కాదు. ఇంతమంది మహిళలు దాదాపు అన్ని సంస్ధల నుంచి రుణాలు పొందాయి. ఇవి పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు కూడా ఉండటం విశేషం.
హెల్ప్ మైక్రో ఫైనాన్స్ సంస్ధ అత్యధికంగా 37.64శాతం వడ్డీ వసూలు చేస్తుండగా తర్వాత స్ధానంలో ఫుల్లర్టన్ ఇండియా సంస్ధ 36శాతంతో నిలిచింది. అలాగే స్వాష్ కెడిట్ కార్పోరేషన్ సంస్ధ 32.36శాతం, ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్ధ 31.08శాతం, ఎల్ అండ్ టి ఫైనాన్స్ సంస్ధ 29.53శాతం, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్ధ 29.89శాతం, ఇంపాక్ట్ సంస్ధ 26.69శాతం, షేర్ మైక్రోపిన్ సంస్ధ 29.64 శాతం, ఆస్మిత మైక్రోపిన్ సంస్ధ 29.64శాతం, క్రిసా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్ధ 26.60శాతం మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి.