రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మే నెల 20వ తేదీన ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రకటించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007 నుంచి గత ఏడాది వరకు నిర్వహించిన ఐదు విడతల కల్యాణమస్తు కార్యక్రమాల్లో 34 వేల నిరుపేద జంటలు తిరుమలేశుని ఆశీస్సులతో కల్యాణాలు చేసుకున్నారని తెలిపారు.
ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమ నిర్వహణపై పండితులు ప్రభాకర్ పూర్ణయ్య సిద్ధాంతి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, సుందర వదనాచార్యులు , వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామమూర్తి కలిసి పంచాంగాన్ని పరిశీలిం చి ముహుర్త నిర్ణయం చేశారన్నారు. ఆ ముహుర్తం ప్రకారం ఈ ఏడాది మే నెల 20వ తేదీ ఉదయం 9.50 గంటల నుంచి 10.04 గంటల మధ్య ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు కృష్ణారావు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి, వారి అనుమతితో అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి జంటల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలో త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఐదవ విడత కార్యక్రమం తరహాలోనే ఆరవ విడత కల్యాణమస్తు కూడా అన్ని శాసన సభా నియోజక వర్గ కేంద్రాల్లో ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం సహాయ సహకారాలతోనే నిర్వహిస్తామని అర్హుల ఎంపిక నుంచి పెళ్లికి అనుమతించే వరకు గత కల్యాణమస్తు నిబంధనలన్నీ యథావిధిగా అమలులో ఉంటాయని ఆరవ విడత క ల్యాణమస్తు రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుందని, ఇతర రాష్ట్రాలలో ఉండదని కృష్ణారావు స్పష్టం చేశారు.