వైఎస్సార్ అభయహస్తంలో ప్రభుత్వం చేపట్టిన నిబంధనలు ప్రతి బంధకాలుగా మారాయి. ఈ పథకంలో కేవలం ఎస్సీ, ఎస్టీ గ్రూపు సభ్యులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో మిగతా గ్రూపు సభ్యుల మహిళలకు నిరాశ ఎదురవుతుంది. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు తప్ప వెనుకబడిన వర్గాల కానీ, ఇతర సామాజిక వర్గాలు ఈ పథకంలో చేరే అవకాశం లేదు. దీంతో మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఐకేపీలో చేరిన ప్రతి గ్రూపు మహిళకు అభయ హస్తం పథకం వర్తించేలా వైఎస్సార్ రూపకల్పన చేశారు.
అయితే ప్రస్తుతం కొత్త నిబంధనలతో బీసీలు, ఇతర వర్గాల మహిళలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 18 నుంచి 59 ఏళ్ల వరకు వయస్సున్న వారికి నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి ఈ అవకాశం లేదు. అదే విధంగా ఈ సారి 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారినే చేర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అభయహస్తం పథకంలో మహిళలు చేరేందుకు మొదట్లో కొంత ఆసక్తి చూపలేదు. కానీ రానురాను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరేందుకు ముందుకు వచ్చారు. మహిళలు పింఛన్లు పొందుతుండటంతో ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకే పరిమితం చేయడంతో వృద్ధ మహిళలకు అవకాశం లేకుండా పోయింది