25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

కేసులు తేలినంత వరకూ ఈస్టుకోస్టు ఆపాల్సిందే..

సంతబొమ్మాళి మండలంలోని కాకరాపల్లిలో నిర్మించ తలపెట్టిన ఈస్టుకోస్టు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు తేలినంతవరకూ నిర్మాణాలు ఆపాల్సిందేనని, లేని పక్షంలో ప్రజలు గాంధేయమార్గంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు. ప్రజలు ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని, పచ్చని పంటభూములు ధ్వంసం కాకూడదని, జల, వాయు కాలుష్యం జరగకుండా చూడాలని కోరుతుంటే, కాకరాపల్లిప్రాజెక్టు విషయంలో శాంతిభద్రతల కోణంలోనే పోలీసులు చూడటం శోచనీయమన్నారు. ప్రజల కోరిక మేరకు ఈ సమస్యను మానవీయకోణంలో పోలీసులు ఎందుకు పరిశీలించడంలేదని ఆయన ప్రశ్నించారు.

కాకరాపల్లి థర్మల్‌ ప్రాజెక్టు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లుతోందని, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చిత్తడి నేలల్లో పరిశ్రమలు నెలకొల్పరాదని, చట్టాలు పేర్కొంటున్నా, సాక్షాత్తూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జైరాంరమేష్‌ స్పష్టం చేసినా కూడా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకుండా, యాజమాన్యానికి దన్నుకాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.